Chevireddy Mohith Reddy Arrested: పోలింగ్ అనంతరం తిరుపతిలో టీడీపీ నేత, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నాయకుడు మోహిత్‌రెడ్డిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. దుబాయ్ వెళ్తున్న మోహిత్‌రెడ్డిని బెంగళూరు విమానాశ్రయంలో తిరుపతి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తారని భావించిన మోహిత్‌రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా నిరాశే మిగిలింది.
దీంతో ఆయన విదేశాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారన్న సమాచారం మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. మోహిత్‌రెడ్డి విదేశాలకు పారిపోకుండా లుక్‌అవుట్ నోటీసులు జారీచేశారు. ఆయన బెంగళూరు నుంచి దుబాయ్ వెళ్లబోతుండగా ఎయిర్‌పోర్టు సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో తిరుపతి పోలీసులు బెంగళూరు వెళ్లి విమానాశ్రయంలో మోహిత్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని అరెస్టు చేసి ఎస్వీయూ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విదేశాలకు వెళ్లకూడదని మోహిత్‌రెడ్డికి పోలీసులు షరతులు విధించారు.
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసు - పోలీసుల అదుపులో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి - chevireddy mohith reddy
సార్వత్రిక ఎన్నికల సమయంలో పోలింగ్ ముగిసిన మర్నాడు తిరుపతిలోని పద్మావతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్‌రూం పరిశీలనకు వెళ్లిన టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగింది. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అనుచరులు రాళ్లు, రాడ్లు, బీరుసీసాలతో నానిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. వర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ వద్ద రాడ్లు, సుత్తి, బీరు సీసాలతో పులివర్తి నానిపై దాడికి తెగబడ్డారు. చంపేందుకు యత్నించగా, నాని గన్‌మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు.
పులిపర్తి నానిపై హత్యాయత్నం ఘటన సంచలనంగా మారడంతో, అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. దీంతో పులివర్తి నాని ఫిర్యాదు మేరకు అప్పటికప్పుడు వైఎస్సార్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి అనుచరులు భానుకుమార్‌రెడ్డి, గణపతిరెడ్డితోపాటు మరికొందరిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మరుసటి రోజే 13 మందిని కోర్టులో హాజరుపరిచారు. తర్వాత కేసుకు సంబంధించిన 34 మందిని అరెస్ట్ చేశారు.
ఈ కేసులో కుట్రదారులు ఎవరనే విషయం పోలీసులకు అప్పట్లోనే తెలిసినా చర్యలు తీసుకునేందుకు వెనుకంజ వేసినట్లు సమాచారం. బాధితులు వీడియో సాక్ష్యాలు అందజేసినా నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై ఎమ్మెల్యే పులివర్తి నాని న్యాయ పోరాటం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారడంతో పోలీసులు కుట్రదారులపై దృష్టి పెట్టారు.
ఈ కేసులో 37వ నిందితుడిగా చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పేరు చేర్చారు. అరెస్టు తప్పదని భావించిన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును సైతం ఆశ్రయించారు. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో మోహిత్ రెడ్డి విదేశాలకు పారిపోకుండా లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. తాజాగా ఆయన బెంగళూరు నుంచి దుబాయ్ వెళ్తుండగా గుర్తించిన విమానాశ్రయ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అరెస్టు చేశారు. అనంతరం 41ఎ నోటీసులు ఇచ్చి మోహిత్‌రెడ్డిని పోలీసులు వదిలేశారు. విదేశాలకు వెళ్లకూడదని మోహిత్‌రెడ్డికి షరతులు విధించారు.
స్వామి భక్తిని చాటుకున్న తిరుపతి పోలీసులు - నానిపై హత్యాయత్నం కేసులో బాధిత పార్టీ నేతలపై కేసులు - Fake Cases on TDP Leaders