Household Consumption Expenditure Survey-2023-24: జాతీయస్థాయిలో కుటుంబ వినియోగ వ్యయం సర్వే వివరాలను కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. దీన్ని ఓ సారి పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం ఎస్టీల్లో అతి తక్కువగా ఉంది. ఈ విధంగా చూస్తే అన్ని వర్గాల ప్రజలు చేసే నెలవారీ తలసరి సగటు వ్యయం కంటే ఎస్టీ కుటుంబాల ఖర్చు గ్రామీణ ప్రాంతాల్లో 28%, పట్టణ ప్రాంతాల్లో 13% మేర తక్కువగా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో సర్వే వివరాలిలా: 2023 ఆగస్టు నుంచి 2024 జులై మధ్య ఈ సర్వేను నిర్వహించారు. ప్రభుత్వాలు అందించే ఉచితాలు, ఇతర సంక్షేమ పథకాలు లేకుండా ప్రజలు తమ సొంత ఆదాయ వనరులతో జాతీయ స్థాయిలో సగటున గ్రామీణ ప్రాంతాల్లో రూ.4,122, పట్టణ ప్రాంతాల్లో రూ.6,996 ఖర్చు చేస్తున్నారు. దీనితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రజలు 29.23%, పట్టణ ప్రాంతవాసులు 2.65% అధికంగా ఖర్చు చేస్తున్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే నెలవారీ తలసరి వ్యయానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఆరోస్థానం, పట్టణ ప్రాంతాల్లో ఎనిమిదో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది.
ఏపీలో రెండింటిలోనూ చివరి స్థానంలో ఎస్టీలు: జాతీయ స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ఎస్టీలు, పట్టణ ప్రాంతాల్లో ఎస్సీల వ్యయం అందరికంటే తక్కువ. కానీ ఏపీలో మాత్రం పట్టణ, గ్రామీణ ప్రాంతాలు రెండింటిలోనూ ఎస్టీలే చివరి స్థానంలో ఉన్నారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇతరులు చేసే నెలవారీ తలసరి వ్యయంతో పోలిస్తే ఓబీసీలది 5.79%, ఎస్సీలది 9.97%, ఎస్టీలది 27.17% మేర తక్కువ. అదే పట్టణ ప్రాంతాల్లో ఓబీసీలు 5.84%, ఎస్సీలు 11.36%, ఎస్టీలు 17.22% తక్కువ ఖర్చు చేస్తున్నారు.
తలసరి వ్యయాల వివరాలు: గ్రామీణ ప్రాంతాల్లో ఓబీసీలది 9.39%, ఎస్సీలది 16.45%, ఎస్టీలది 27.55% వరకు తక్కువ ఉంది. పట్టణప్రాంతాల్లో ఓబీసీలు 14%, ఎస్సీలు 26.26%, ఎస్టీలు 23% తక్కువ ఖర్చు చేస్తున్నారు. ఇతరులు-ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కుటుంబాల మధ్య నెలవారీ తలసరి వ్యయంలో జాతీయస్థాయిలో ఉన్న అంతరం కంటే ఏపీలో కొంత తక్కువగా ఉంది.
నిత్యావసర వస్తువుల ఖర్చుల ఆధారంగా సర్వే: ఈ సర్వేచేసే నాటికి వారం రోజుల ముందు తీసుకున్న వంటనూనెలు, గుడ్లు, చేపలు, మాంసం, పాలు, పాల ఉత్పత్తులు, కూరగాయలు, పండ్లు, మసాలా దినుసులు, పానీయాలు, శుద్ధిచేసిన ఆహారాలు, పాన్, పొగాకు, మద్యం, 30 రోజుల ముందు ఖర్చుచేసిన ఇంధనం, విద్యుత్తు, అద్దె, ఇతర వస్తువులు, సేవలు, 365 రోజుల్లో వాడిన దుస్తులు, బెడ్డింగ్, పాదరక్షలు, విద్య, ఆసుపత్రి ఖర్చులు, విద్యుత్తు, ఎలక్ట్రానిక్ వస్తువుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ సర్వే చేసింది. తలసరి వినియోగ వ్యయంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య 2022-23లో 39 శాతం వ్యత్యాసం ఉంటే 2023-2024 లో ఈ అంతరం 35 శాతానికి తగ్గింది.
గ్రామీణ ప్రాంతాల్లో కేరళ-పట్టణ ప్రాంతాల్లో తెలంగాణ: జాతీయస్థాయిలో సగటున అత్యధిక నెలవారీ తలసరి వ్యయం చేసే రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కేరళ, పట్టణ ప్రాంతాల్లో తెలంగాణ ముందు నిలిచాయి. కేరళ గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ, ఓబీసీలు, ఇతరులు, తెలంగాణ పట్టణ ప్రాంతాల్లోని ఎస్సీలు, ఓబీసీలు, ఇతరులు జాతీయ స్థాయిలో అన్నిరాష్ట్రాల కంటే ఎక్కువ మొత్తంలో నెలవారీ తలసరి వ్యయం చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, బిహార్, ఝార్ఖండ్‌లు అన్ని కేటగిరీల్లోనూ వెనకబడి ఉన్నాయి.
త్వరలో ప్రతి శనివారం 'నో బ్యాగ్డే' - ఉపాధ్యాయులకు ఒకటే యాప్: మంత్రి లోకేశ్
పాత ఒప్పందాలు రద్దు! - ఇకపై అన్ని ఆలయాల్లో ఆ నెయ్యినే వాడాలి
అప్పుల్లో ఆంధ్ర టాప్ - గ్రామీణ మహిళలే ముందంజ - అది ఎలాగంటే?