medical college dormitories : వైద్య కళాశాలల నిర్మాణాలను పటిష్ఠంగా చేపట్టాలని, ఎందుకంటే చేపట్టే పనులు ఇప్పటి తరానికే కాదు, భవిష్యత్తు తరాల వారికీ ప్రయోజనం కల్పించేవి కావాలని వైద్య, ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వీటి వల్ల ప్రజారోగ్య వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని, ఎలాంటి సమస్యలు వచ్చినా ప్రజలను రక్షించుకోవడానికి ఇవి ఉపయోగపడతాయని గొప్పలు చెప్పారు. కానీ, వాస్తవాలు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయి.
జబ్బుల బారిన పడిన రోగులకు చికిత్సలు, శస్త్ర చికిత్సలు చేసేందుకు వైద్యశాస్త్రం అభ్యసిస్తున్న భావి వైద్యులు ప్రభుత్వం పెట్టే సహన చికిత్సను ఎదుర్కొంటున్నారు. ముక్కుతూ, మూలుగుతూ మంచానపడిన రోగులకు చికిత్సలు చేయడం దేవుడెరుగు. వసతి గృహాల్లోని అసౌకర్యాలతో బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు. గదుల కొరత, దోమల బెడద, అపరిశుభ్ర వాతావరణం, నాసిరకం భోజనం తదితర సమస్యలతో చదువులు ఈడుస్తున్నారు. అయినా, ఆరోగ్యాంధ్రను నిర్మించడంలో కీలకమైన భావి వైద్యులకు సౌకర్యాలు కల్పించడంపై సీఎం జగన్ పట్టించుకోవట్లేదు.
ఏడాదిలో 694 ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్ధుల సీట్లను అమ్మేస్తారా ! ఇదేనా బడుగు బలహీనవర్గాలపై ప్రేమ..
నాడు-నేడు కింద 3 వేల 820 కోట్లతో 11 బోధనాసుపత్రులను అభివృద్ధి చేస్తామని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించింది. ఆ నిధులతో ఆసుపత్రులు, వైద్య కళాశాలలు, వసతి గృహాల రూపురేఖలు మారుస్తున్నామని గొప్పలు చెప్పుకొంది. కానీ ఆచరణలో అందుకు విరుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. పీజీ సీట్ల పెంపునకు తగ్గట్లు రాష్ట్రానికి కేంద్రం 756 కోట్లు ఇచ్చింది. ఈ నిధులతో పనులు నామమాత్రంగా జరుగుతున్నాయి. నిధుల కొరతతో కొత్త వైద్య కళాశాలల (Medical Colleges) నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. శిథిలావస్థకు చేరుకున్న గదులపై నుంచి పెచ్చులూడి పడుతున్నాయి.
వందేళ్ల చరిత్ర కలిగిన విశాఖ ఆంధ్ర వైద్య కళాశాల (Andhra Medical College) లో గదుల కొరత నెలకొంది. ఇక్కడి ఐదు వసతి గృహాల్లో కనీస వసతులు లేవు. కళాశాల ఏర్పడిన తొలినాళ్లలో ప్రారంభించిన వసతి గృహాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన పీజీ, యూజీ వసతి గృహాల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. గతేడాది జనవరిలో ప్రారంభమైన నిర్మాణ పనులు శ్లాబుల దశను దాటలేదు. దీంతో ఎక్కువ మంది విద్యార్థులు ప్రైవేటు హాస్టళ్లను ఆశ్రయిస్తున్నారు. కళాశాలలో యూజీ కోర్సుల్లో ఏడాదికి 250 మంది చొప్పున ఐదేళ్లకు కలిపి 1,250 మంది ఉన్నారు. వీరిలో 60 శాతం మంది మహిళలే. పీజీ, హౌస్ సర్జన్స్ విద్యార్థుల సంఖ్య 2,541. అయితే ఇందులో కేవలం 1,100 మందికే వసతి గృహ సదుపాయం ఉంది.
ED Raids on Telangana Medical Colleges : పీజీ సీట్ల బ్లాకింగ్ దందాలో.. ఈడీ చేతికి కీలక ఆధారాలు
గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు పాత వసతి గృహ భవనాల్లో అసౌకర్యాల మధ్య బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు. తాగునీటి సౌకర్యం కరవైంది. భోజనం నాణ్యంగా లేకపోవడంతో కొందరు విద్యార్థులు గదుల్లోనే సొంతంగా వండుకుంటూ ఆకలి తీర్చుకుంటున్నారు. ఇక్కడి ప్రాంగణంలో కొత్తగా చేపట్టిన గదుల నిర్మాణాలు మందకొడిగా సాగుతున్నాయి. విజయవాడ ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా 1985లో వసతి గృహం నిర్మించారు. ప్రస్తుతం ఇవి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆ వసతి గృహంలోనే సుమారు 450 మంది విద్యార్థులు ఉంటున్నారు. 22 కోట్లతో 400 మంది విద్యార్థులకు సరిపడా భవన నిర్మాణ పనులకు గత ప్రభుత్వ హయాంలో 2017 నవంబరులో శంకుస్థాపన జరిగింది. నిర్దేశించిన లక్ష్యం మేరకు 18 నెలల్లో పూర్తికావాలి. కానీ ఇప్పటివరకు పనులు పూర్తికాలేదు. పూర్తయిన పనులకు తగ్గట్లుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. దీంతో ఇప్పటివరకు భవన నిర్మాణం పూర్తవలేదు. విద్యార్థులు పాత భవనంలో అసౌకర్యాల మధ్య కాలం గడుపుతున్నారు. భవనం పైనుంచి పెచ్చులూడి పడుతుండటంతో విద్యార్థినులు బెంబేలెత్తుతున్నారు.
కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాల వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థినులను ఓ వైపు కుక్కల బెడద, మరోవైపు దోమల బెడద వేధిస్తోంది. వసతి గృహంలో తీవ్రంగా దోమలు ఉండటంతో విద్యార్థినులు తరచూ అనారోగ్యం పాలవుతున్నారు. డ్రైనేజీ పైపులైన్లు దెబ్బతిన్నాయి. మరుగుదొడ్ల తలుపులు ఊడిపోయాయి. మొదటి సంవత్సరం విద్యార్థినులకు తగిన సంఖ్యలో గదులు లేకపోవడంతో ఒకే గదిలో ముగ్గురు విద్యార్థినులు ఉండాల్సిన దుస్థితి నెలకొంది.
Fees Burden On Medical Students: ఎంబీబీఎస్ సీట్ల విభజన.. పీజీ విద్యార్థులపై ఫీజుల భారం.. రాష్ట్ర ప్రభుత్వంపై జాడాల ఆగ్రహం
ఒంగోలు వైద్య కళాశాల వసతి గృహంలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. వసతి గృహంలో 600 మంది వైద్య, 100 మంది పీజీ విద్యార్థులు, సిబ్బంది క్వార్టర్స్‌లో 200 మంది ఉద్యోగులు నివాసం ఉంటున్నారు. బీఎస్సీ నర్సింగ్ కళాశాలకు సొంత భవనం లేదు. దీంతో మరో 200 మంది విద్యార్థినులకు ఆసుపత్రి మూడో అంతస్తులోని గదుల్లో వసతి సౌకర్యం కల్పించారు. వీరందరికీ సరిపడా నీరు సరఫరా కావడం లేదు.
ఏలూరు వైద్య కళాశాల వసతి గృహంలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి 150 మంది విద్యార్థులకు సర్వజన ప్రభుత్వాసుపత్రి మాతా శిశు విభాగం పైన ఉన్న బ్లాక్‌లో వసతి గృహం ఏర్పాటు చేశారు. ఒకే ప్రాంగణంలో ఓ వైపు విద్యార్థులకు, దానికి ముందు బ్లాక్‌లో విద్యార్థినులకు వసతి గృహాలను కేటాయించారు. ఇక్కడికి గత కొన్ని రోజులుగా మురుగునీరు సరఫరా అవుతోంది. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో దశాబ్దాల క్రితం నిర్మించిన వసతి గృహ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. స్లాబు పెచ్చులు ఊడి కిందపడిపోతున్నాయి. గదులు అనువుగా లేవని, భోజనం నాసిరకంగా ఉంటోందని విద్యార్థులు పలు సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేశారు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు.
ఎందుకీ నిర్లక్ష్యం? - ప్రభుత్వ నిర్వాకంతో ప్రమాదంలో 7 వైద్య కళాశాలల భవితవ్యం