YSRCP Dissident Leaders Meetings :సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార వైఎస్సార్సీపీలో అసమ్మతి నేతలు ఒక్కొక్కరుగా పుట్టగొడుగుల్లా బయటకు వస్తున్నారు. ముఖ్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లాలో మరోసారి వర్గ విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. రెండు రోజుల క్రితం ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి వ్యతిరేకంగా సమావేశం ఏర్పాటు చేసి రాచమల్లుకు టిక్కెట్ ఇస్తే తాము ప్రత్యేక కార్యాచరణకు దిగుతామని అసమ్మతి నేతలు హెచ్చరించారు. ఈ సమస్య తీరక ముందే బద్వేలు వైఎస్సార్సీపీలో విభేదాలు భగ్గుమన్నాయి.
ఎమ్మెల్యే సుధాకు నాయకులెవరో తెలీదు :బద్వేలు ఎమ్మెల్యే సుధాకు మరోసారి టిక్కెట్ ఇవ్వడంపై ఆ పార్టీలో విభేదాలు తలెత్తాయి. వైఎస్సార్సీపీ నేత నల్లేరు విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో అసమ్మతి నేతలు సమావేశం అయ్యారు. ఎమ్మెల్యే సుధా ఈ ఐదేళ్లలో ఏ ఒక్క రోజు నియోజక వర్గంలో తిరగలేదని, ఆమెకు కార్యకర్తలెవరో, పార్టీ నేతలెవరో తెలియదని తెలిపారు. నేతలలో పరిచయ కార్యక్రమం సక్రమంగా చేసుకోలేదని అన్నారు.
వైఎస్సార్సీపీ అసమ్మతి నేతల రహస్య సమావేశం - పార్టీలో కలకలం
పార్టీలో పని చేసే వారికే గుర్తింపు లేదు :బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి చెప్పిన విధంగా ఎమ్మెల్యే నడుచుకుంటున్నారని విశ్వనాథరెడ్డి ఆరోపించారు. నియోజవర్గంలో తెలుగుదేశం బలంగా ఉన్న రోజుల నుంచి వైసీపీకి అండగా ఉన్నామని, తాము ఏ పదవులు ఆశించలేదని తెలిపారు. పార్టీలో పని చేసే వారికే గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని వారికి అండగా ఉంటానని స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డి మారువేషంలోనైనా వచ్చి డీసీ గోవిందరెడ్డి వ్యవహార శైలిని తెలుసుకోవాలని ఆయన సూచించారు.