ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

జగన్​ పార్టీకి ఓటేయొద్దు- మా నాన్నని వాళ్లే చంపారు : వైఎస్​ సునీత - ys sunitha pressmeet

Do not vote YSRCP : సరిగ్గా ఐదేళ్ల కిందట జరిగిన ఘోరం.. నమ్ముకున్న వాళ్లే చేసిన నేరం.. ఎవ్వరూ ఊహించని దారుణం.. 'నా' అనుకున్న వాళ్లే గొడ్డలి పోటు వేశారు.. తమ మధ్యే ఉంటూ తన తండ్రిని హతమార్చారు.. న్యాయం కోసం ఆమె చేయని పోరాటం లేదు. తొక్కని గడప లేదు.. ఎక్కని కోర్టు లేదు. ఐదేళ్లుగా ఒంటరిగా పోరాడుతున్న ఆ తెలుగింటి ఆడబిడ్డ ఇవాళ దిల్లీ వేదికగా కన్నీరుమున్నీరైంది. తనకు న్యాయం చేయమని వేడుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల మద్దతు, తీర్పు తనకు కావాలి అని కొంగుపట్టి ప్రాధేయపడుతోంది. 'మా అన్న పార్టీ వైఎస్సార్సీపీకి ఓటు వేయవద్దు' అని వైఎస్​ వివేకా కూతురు సునీత తెలుగు ప్రజలను కోరారు. 'వంచన, మోసం చేసిన పార్టీకి ఓటు వేయవద్దు' అని విజ్ఞప్తి చేశారు.

ys_sunitha_viveka_murder_case_press_meet
ys_sunitha_viveka_murder_case_press_meet

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 1, 2024, 12:27 PM IST

Updated : Mar 1, 2024, 4:15 PM IST

Do not vote YSRCP : హత్యా రాజకీయాలు ఉండకూడదని, తన అన్న పార్టీ వైఎస్సార్సీపీకి ప్రజలు ఓటు వేయవద్దని వైఎస్​ వివేకానందరెడ్డి కూతురు సునీత కోరారు. వంచన, మోసం చేసిన పార్టీకి ఓటు వేయవద్దని విన్నవించారు. అవినాష్‌, భాస్కర్‌రెడ్డిని ఇంకా రక్షిస్తూనే ఉన్నారని, ఇదే ప్రభుత్వం మళ్లీ వస్తే ఇంకా కష్టాలే అని చెప్పారు. వైఎస్‌ సునీతారెడ్డి దిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ విషయాలు ఆమె మాటల్లోనే..

జగన్​ పార్టీకి ఓటేయొద్దు- మా నాన్నని వాళ్లే చంపారు : వైఎస్​ సునీత

'నేను ఎక్కడికి వెళ్లినా నా తండ్రి హత్యకేసు గురించే అడుగుతున్నారు. ఈ ఐదేళ్లు నా కుటుంబం ఎంతో ఇబ్బంది పడింది. నాకు అండగా నిలిచిన మీడియా, పోలీసు, లాయర్లకు కృతజ్ఞతలు. నాకు సహకరిస్తున్న రాజకీయ నాయకులకు కూడా ధన్యవాదాలు. చంద్రబాబు, మహాసేన రాజేష్‌, సీపీఐ నేత నారాయణ, సీపీఎం నేత గఫూర్ వంటి చాలామంది సహకరించారు. నా పోరాటానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు' అని తెలిపారు.

సాధారణంగా హత్య కేసు 4, 5 రోజుల్లో తేలుతుందన్న సునీత, తన తండ్రి హత్య కేసు దర్యాప్తు మాత్రం ఎందుకు ఏళ్ల తరబడి కొనసాగుతోందని ప్రశ్నించారు. 'ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా నాన్న ఓటమి పాలయ్యారని, సొంతవాళ్లే మోసం చేసి ఓడించారని అనుకుంటున్నాం.. ఓటమి పాలైన నా తండ్రిని మరింత అణచాలని చూశారు.. హంతకులు మనమధ్యే ఉంటారు.. వాళ్లను కనుక్కోవాలి కదా?' అని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య కేసు దర్యాప్తు ఇప్పటికే అక్కడే ఉందన్న సునీత తనకు ప్రజాకోర్టులో తీర్పు కావాలని కోరారు. జరిగిన ఘటనలు ప్రజల ముందు ఉంచితే న్యాయం జరుగుతుందని ఆశించారు.

మార్చురీ వద్ద అవినాష్‌ తనతో మాట్లాడారని, పెదనాన్న 11.30 వరకు తన కోసం ప్రచారం చేశారని చెప్పారని గుర్తు చేసుకుంటూ అలా ఎందుకు చెప్పారో అర్థం కాలేదని అన్నారు. ఒక్కోసారి హంతకులు మనమధ్యే ఉంటున్నా తెలియనట్లే ఉంటుందని పేర్కొన్నారు.

హత్య కేసును ఇంతవరకు తేల్చలేకపోతున్నారు.. సీబీఐ దర్యాప్తునకు వెళ్దామని జగన్‌ను అడిగితే 'సీబీఐకి వెళ్తే అవినాష్‌ బీజేపీలోకి వెళ్తారు' అని చెప్పారని వెల్లడించారు. అరెస్టు, ఛార్జిషీటుకు ఏడాది సమయం పట్టింది.. కేసు దర్యాప్తు ఎందుకంత ఆలస్యం జరుగుతుందో అర్థం కావట్లేదని సునీత తెలిపారు.

నిందితులను పట్టుకోవడంలో ఇంత జాప్యం ఏ కేసులో లేదన్న సునీత సీబీఐపైనా కేసులు పెట్టడం మొదలుపెట్టారని, కేసు దర్యాప్తు అధికారులపైనే కేసులు పెట్టి భయపెట్టారని వివరించారు. కర్నూలులో అవినాష్‌ను అరెస్టు చేయడానికి సీబీఐ అధికారులు వస్తే ఉద్రిక్త వాతావరణం సృష్టించారని గుర్తు చేశారు. సీబీఐ విచారణకు ఆదేశించిన పిటిషన్‌ను ఎందుకు విత్ డ్రా చేసుకున్నారని, కొత్త ప్రభుత్వం ఏర్పడకముందే జగనన్న ఎందుకు విత్‌ డ్రా చేసుకున్నారని నిలదీశారు.

విలువలు, విశ్వసనీయత అని పదే పదే అంటుంటారు కదా, మాట తప్పను, మడప తిప్పను అంటుంటారు కదా! మరి మా నాన్న హత్యకేసులో ఇలాంటివి ఏమయ్యాయి? వివేకాను చంపిన వారిని వదిలిపెడితే ఏం సందేశం వెళ్తుంది? మంచి, చెడుకు యుద్ధమంటున్నారు.. ఏది కరెక్టో వాళ్లే చెప్పాలి. పేదలు, పెత్తందార్లకు మధ్య యుద్ధమంటున్నారు.. కానీ, న్యాయం కోసం ఐదేళ్లుగా పోరాడుతున్నా పట్టించుకోవట్లేదు. - వైఎస్​ సునీతారెడ్డి

శివశంకర్‌రెడ్డి అరెస్టు తర్వాత మొత్తం కేసు మారిపోయిందని, నిందితుల్లో భయం పట్టుకుందని, అప్పటి నుంచే సీబీఐపై కేసులు పెట్టడం ప్రారంభించారని సునీత వెల్లడించారు. సిబ్బందిపై కేసుల తర్వాత కడప నుంచి సీబీఐ అధికారులు వెళ్లిపోయారని, హైదరాబాద్‌కు కేసు బదిలీ అయ్యాకే కేసు విచారణ ప్రారంభమైందని తెలిపారు. అవినాష్‌ అరెస్టు కోసం వెళ్లినప్పుడు కర్నూలులో ఏం జరిగిందో అందరికీ తెలుసన్న సునీత.. సీబీఐ అరెస్టు చేయడానికి వెళ్లి వెనక్కి వచ్చిన సందర్భం ఎప్పుడైనా చూశామా? అని ప్రశ్నించారు. సీబీఐ అరెస్టు చేయాలనుకున్న వ్యక్తి కళ్లెదుటే ఉన్నా రెండురోజులు ఎదురుచూసి ఒట్టి చేతులతో వెనక్కి వచ్చారని పేర్కొనారు.

హత్యా రాజకీయాలు ఉండకూడదని, తన అన్న పార్టీ వైఎస్సార్సీపీకి ప్రజలు ఓటు వేయవద్దని సునీత కోరారు. వంచన, మోసం చేసిన పార్టీకి ఓటు వేయవద్దని విన్నవించారు. అవినాష్‌, భాస్కర్‌రెడ్డిని ఇంకా రక్షిస్తూనే ఉన్నారని, ఇదే ప్రభుత్వం మళ్లీ వస్తే ఇంకా కష్టాలే అని చెప్పారు. అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి సీబీఐ విచారణలో ఉన్నారు.. అధికారంలో ఉన్నవాళ్లే వారిని రక్షిస్తున్నారు.. జగన్‌ పాత్రపై విచారణ జరగాలి, నిర్దోషి అయితే వదిలేయాలని అన్నారు. ఒక్కసారి బెయిల్‌పై బయటికొస్తే ప్రభావితం చేయరా? అని ప్రశ్నించిన సునీత.. సీబీఐ దర్యాప్తు ఎందుకు త్వరగా పూర్తికావట్లేదని నిలదీశారు. సీబీఐ అధికారులపై ఒత్తిడి ఏంటో తెలియట్లేదని అన్నారు. మొదట్నుంచీ న్యాయం కోసమే పోరాడుతున్నా.. ముందుముందు ప్రజల్లోకి కూడా వెళ్లాల్సి ఉంటుందని, తనపైనా కేసులు పెట్టారంటే ఏం అర్థం చేసుకోవాలి? అని వాపోయారు.

Last Updated : Mar 1, 2024, 4:15 PM IST

ABOUT THE AUTHOR

...view details