YS Sunitha to Join in Congress: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిలతో వివేకా (YS Vivekananda Reddy) కుమార్తె సునీత ఇడుపులపాయ కేంద్రంగా భేటీ (YS Sharmila Sunitha Meeting) కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సోమవారం ఉదయం ఏడున్నర గంటలకు పులివెందుల నుంచి ఇడుపులపాయ వెళ్లిన సునీత, ఎస్టేట్‌లో షర్మిలతో భేటీ అయ్యారు.
ఇద్దరూ ఏకాంతంగా రెండు గంటల పాటు చర్చలు జరిపారు. వచ్చే ఎన్నికల్లో కడప జిల్లాలో ముఖ్యంగా కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ స్థానాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులపై చర్చించారు. పులివెందుల అసెంబ్లీకి వైసీపీ నుంచి సీఎం జగన్, కడప పార్లమెంటు నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి పోటీలో ఉండటంతో వారిద్దరినీ ఢీ కొట్టాలంటే తమ కుటుంబం నుంచే కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉండాలనే అంశం ఇద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది.
వివేకా హత్య కేసులో నిందితుల్ని పట్టుకునేందుకు సోదరుడు సీఎం జగన్ నుంచి రిక్తహస్తం ఎదురు కావడంతో సునీత ఒంటరిగా న్యాయ పోరాటం చేస్తున్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి సీబీఐ విచారణ కోరడంతో, ఆ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు అరెస్టు సైతం అయ్యారు. ఈమెకు మొదటి నుంచి షర్మిల మాత్రమే అండగా నిలబడ్డారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై న్యాయ పోరాటంలోనూ సునీతకు వైఎస్ షర్మిల అండగా నిలిచారు. సీబీఐకి తన వాంగ్మూలాన్ని కూడా షర్మిల ఇచ్చారు.