Chevella Lok Sabha Election Fight :తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాల్లో ఒకటైన చేవెళ్ల లోక్ సభ స్థానాన్ని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఈ పార్లమెంటు స్థానాన్ని కాంగ్రెస్ ఒకసారి దక్కించుకోగా, బీఆర్ఎస్ రెండుసార్లు సొంతం చేసుకుంది. కమలం పార్టీ ఖాతా తెరవలేకపోయింది. కానీ ఈసారి ఆయా పార్టీలు నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతూ కోటీశ్వరులైన అభ్యర్థులనే రంగంలోకి దింపాయి. కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఎంపీ అభ్యర్థులుగా పోటీ పడుతున్నారు. ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ మెజార్టీపై అంచనాలు వేసుకుంటున్నారు.
కాంగ్రెస్ లక్ష మెజార్టీతో గెలుస్తామని భావిస్తుండగా గత ఎన్నికలతో పోల్చితే 3 లక్షలపైనే తనకు మెజార్టీ రావచ్చని బీజేపీ అభ్యర్థి కొండా ఆశిస్తున్నారు. బీఆర్ఎస్ మాత్రం మెజార్టీ లెక్కలు పక్కనపెడితే సిట్టింగ్ స్థానాన్ని చేజార్చుకోమని, మూడోసారి కూడా గెలిచి చూపిస్తామని ప్రత్యర్థులకు సవాల్ విసురుతోంది. వీరికి తోడు మరో 40 మంది ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. అయితే ఈ పార్లమెంటులో గడిచిన మూడు ఎన్నికల్లో లక్షల మంది ఓటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉండటం శోచనీయం. పట్టణ, గ్రామీణ ప్రాంత నియోజకవర్గాల మిళితంగా ఉండే చేవెళ్ల లోక్‌సభలో గ్రామీణ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధిక ఓటర్లున్న శేరిలింగంపల్లిలో చాలా మంది ఓటింగ్‌కు దూరంగా ఉండటం ఈ ఎన్నికల గెలుపు ఓటములపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.
2019 లోక్‌సభ ఎన్నికలు : 2019 ఎన్నికల్లో 23,02,163 మంది ఓటర్లు ఉండగా, కేవలం 13 లక్షల మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. అప్పుడు 53 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. అందులో బీఆర్ఎస్కు 5,28,148 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 5,13,831 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 2,01,960 ఓట్లు పోల్ అయ్యాయి. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు కేవలం 1 శాతం ఓటింగ్ తేడా మాత్రమే ఉంది. ఈ ఓటింగ్ శాతంతోపాటు మారిన రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ప్రచారాన్ని ముమ్మరం చేసిన మూడు పార్టీలు తమదైన శైలిలో హామీలు, ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి.