ప్రారంభించిన మరుసటి రోజే మూడు ముక్కలైన విశాఖ ఫ్లోటింగ్ బ్రిడ్జి Visakha Floating Bridge Broken: విశాఖ బీచ్ రోడ్డులో ఆదివారం ప్రారంభించిన ఫ్లోటింగ్ (నీటిపై తేలియాడే) వంతెన తెగిపోయింది. వీఎంఆర్డీయే నిధులు రూ. 1.60 కోట్లు వెచ్చించి నిర్మించిన వంతెనను వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ కలిసి అట్టహాసంగా ప్రారంభించారు. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ప్రారంభించిన రెండో రోజే తెగిపోవటంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అబ్బాయ్ ప్రారంభించిన 'బస్ బే' గాలికి ఎగిరిపోతే, బాబాయ్ రిబ్బన్ కట్ చేసిన 'ఫ్లోటింగ్ బ్రిడ్జి' అలలకు కొట్టుకుపోయిందని తెలుగుదేశం జాతీయప్రధానకార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. మూడు ముక్కలాట బ్యాచీ పనులన్నీ ఇంతే అని విమర్శించారు. విశాఖలో ఫ్లోటింగ్ బిడ్జ్ సక్రమంగా కట్టలేని ముఖ్యమంత్రి జగన్ రాజధాని కట్టగలిగే సత్తా ఉందంటే ప్రజలు నమ్ముతారా? అని బీజేపీ ప్రశ్నించింది. విశాఖ ఆర్కే బీచ్‌లో ఫ్లోటింగ్ బిడ్జ్ నిర్మాణంలో అవినీతి వల్ల నాణ్యత లోపం తలెత్తి ప్రజల ప్రాణాల మీదకు తెచ్చారని ఆ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ మండిపడ్డారు. బ్రిడ్జ్ తెగిన సమయంలో పర్యాటకులు ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పిందన్నారు. విశాఖలో ఇప్పుడు ఫ్లోటింగ్ బిడ్జ్ కూలిందని, త్వరలో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పేక మేడలాగా కూలిపోతుందని పేర్కొన్నారు.
Young Woman Stuck Between Rocks at Visakha Beach: విశాఖ బీచ్‌లో రాళ్ల గుట్టల మధ్య యువతి.. 12 గంటలు నరకయాతన..
కాగా ఆదివారం విశాఖ బీచ్ రోడ్డులో సుమారు 100 మంది సందర్శకులు నిలబడేలా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. ఈ రోజు నుంచి సందర్శకులు అనుమతి ఇచ్చారు. పెద్దవారికి 100 రూపాయలు, చిన్నారులకు రూ. 70 చొప్పున టికెట్ ధర కేటాయించారు. అయితే ఇంతలోనే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చివరి భాగం విడిపోయి సముద్రంలో కొంత దూరం కొట్టుకుపోవటంతో పర్యాటకులు తీవ్ర ఆందోన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన ఈ విషయంలో సర్కార్‌కు నిర్లక్ష్యం తగదని అంటున్నారు.
వంతెన కూలిపోయే సమయంలో సందర్శకులు లేకపోవటం వల్ల పెను ప్రమాదం తప్పిందని, లేకుంటే చాలా ప్రమాదం జరిగి ఉండేదని మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వైపు ప్రజలు వెళ్లకుండా భద్రత ఏర్పాట్లు చేశారు. నిర్వహణలో భాగంగానే వంతెన తెగిందని బ్రిడ్జ్ నిర్వహణ సంస్థ తెలిపింది. తెగిపోయిన చివరి భాగాన్ని తీసుకువచ్చి మరమ్మతులు చేసే పనిలో బ్రిడ్జ్ నిర్వాహకులు నిమగ్నమయ్యారు. అయితే ఈ బ్రిడ్జి బిగించిన ప్లాస్టిక్ బోల్ట్ భాగాలు అలల ఉద్ధృతికి విరిగిపోయి కనిపించడం విశేషం.
Visakha Beach Turns into Pollution: డంపింగ్యార్డ్ని తలపిస్తోన్న విశాఖ బీచ్.. ప్రకృతి ప్రేమికుల ఆందోళన
సుబ్బారెడ్డి ఇటీవలే రాజ్యసభకు ఎన్నికైనప్పటికీ ఇంకా అధికారికంగా ఎంపీ కాలేదు. ఏప్రిల్ 2 తర్వాతే ఆయన రాజ్యసభ సభ్యుడిగా ప్రోటోకాల్‌కు అర్హుడవుతాడు. ఆయనకు పార్టీ హోదా తప్ప ఎలాంటి అధికారిక హోదా లేదు. మంత్రి, కలెక్టర్ సమక్షంలో ఏ ప్రోటోకాల్‌లో లేని వైవీతోనే రిబ్బన్ కటింగ్ చేయించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.