Chevella Bjp Candidate Konda Nomination : చేవెళ్లలో బీజేపీ విజయం తథ్యమని, లోక్‌సభ నియోజకవర్గంలో ఈసారి 3 లక్షలకు పైగా ఓట్లు తమకు వస్తాయని ఆ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రధానిగా మోదీని ఇప్పటికే దేశ ప్రజలు నిర్ణయించారని పేర్కొన్న ఆయన, చేవెళ్ల బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ కార్యాలయంలో కొండా నామపత్రాలు దాఖలు చేశారు.
కేంద్రమంత్రి పీయూష్ గోయల్, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ సమక్షంలో ఆర్వో అధికారికి విశ్వేశ్వర్‌రెడ్డి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకుముందు చేవెళ్ల నుంచి తన సతీమణి సంగీతా రెడ్డి, పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి విశ్వేశ్వర్‌రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి దశ దిశ లేదన్న కొండా, రాజకీయాల కోసం ఆ పార్టీ ఏదైనా చేస్తుందన్నారు.
Union Minister Piyush Goyal Comments: బీజేపీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్, కాంగ్రెస్ పార్టీ పేదల కోసం ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదని విమర్శించారు. రాజీవ్ గాంధీ రూ.100 ఇస్తే, దళారులు రూ.85 తిని రూ.15 మాత్రమే పేదలకు అందేవని అన్నారు. రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరని కరప్షన్, కుటుంబ పాలనకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. తెలంగాణలో అవినీతి బీఆర్ఎస్ సర్కార్ పని అయిపోయిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని విమర్శించారు. దేశంలో పేదరిక నిర్మూలన కోసం ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని, తెలంగాణలో బీజేపీ అన్ని సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
"తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో బీజేపీ గెలవబోతుంది. దేశంలో ఎన్టీయే కూటమికి నాలుగు వందలకు పైగా సీట్లు వస్తాయి. మోదీ పాలనలో ప్రతి కుటుంబానికీ సంక్షేమ పథకాలు అందాయి. ఇండియా కూటమిలో అన్ని పార్టీలు కలిసి లేవు. కాంగ్రెస్ సీపీఐతో కేరళలో కుస్తీ, దిల్లీలో దోస్తీ చేస్తోంది." - పీయూష్ గోయల్, కేంద్రమంత్రి