TS High Court On KA Paul Petition :కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించాలని కేఏ పాల్ వేసిన పిటిషన్పైహైకోర్టులో (High Court) నేడు విచారణ జరిగింది. కాళేశ్వరంపై నమోదైన ఇతర పిటిషన్లతో కలిపి విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది. ఇప్పటికే జ్యుడీషియల్ కమిటీ వేసినట్లు (Judicial) ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కాళేశ్వరంపై ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ, కాళేశ్వరం అక్రమాలపై దర్యాప్తునకు సిద్ధంగా ఉన్నామంది. హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తే దర్యాప్తు చేస్తామని వివరించింది. అయితే దర్యాప్తునకు వనరులు, సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరింది.
KA Paul Comments On KCR :మరోవైపు తను హైకోర్టులో వేసిన పిటిషన్పై కేఏ పాల్ స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో (Kaleswaram Project) రూ.వందల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి, సీబీఐతో విచారణ జరిపించాలని కోరినట్లుగా తెలిపారు. తన పిటిషన్ను హైకోర్టు పరిగణనలోకి తీసుకుందని, ఏప్రిల్ రెండో తేదీకి కేసును వాయిదా వేసినట్లుగా కేఏ పాల్ వెల్లడించారు.
" కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని హైకోర్టులో పిటిషన్ వేశాను. నా పిటిషన్ను హైకోర్టు పరిగణనలోకి తీసుకుని విచారిస్తామని చెప్పింది. కేసును ఏప్రిల్ రెండో తేదీకి వాయిదా వేసింది. గత ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.కోట్లు దండుకున్నారు. కేసు విచారణ జరిగితే అన్ని వివరాలు బయటకు వస్తాయి"- కేఏ పాల్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు