Tirupati Lok Sabha Constituency Details:ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి లోక్‌సభ ఎన్నికలు అధికార వైఎస్సార్సీపీ, ఎన్డీఏ కూటమి మధ్య హోరాహోరీగా సాగుతున్నాయి. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత 1984, 1999 ఎన్నికల్లో తప్ప నియోజకవర్గం ఏర్పాటు నుంచి అత్యధిక పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రాష్ట్ర విభజన తర్వాత ప్రాభవం కోల్పోయింది. ఆ తర్వాత 2014, 2019 సాధారణ ఎన్నికలతో పాటు 2021 ఉపఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన వైఎస్సార్సీపీ మరోసారి గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది.
తిరుపతి పార్లమెంట్ స్థానం నుంచి కూటమి, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్‌తో పాటు 23 మంది అభ్యర్థులు పోటీపడుతున్నా ఎన్డీఏ కూటమి, వైఎస్సార్సీపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. వైఎస్సార్సీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ గురుమూర్తి, ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి వరప్రసాదరావు, కాంగ్రెస్ నుంచి చింతామోహన్, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయకుమార్ పోటీపడుతున్నారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి, ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
'హే కృష్ణా' చరిత్ర పునరావృతమేనా? - వారు అసెంబ్లీలో అడుగుపెట్టలేరా! - Tension in ministers
తిరుపతి లోక్‌సభ పరిధిలో మొత్తం 17లక్షల 27వేల 402 మంది ఓటర్లు ఉండగా పురుషులు 8లక్షల 30వేల 332 మంది, మహిళలు 8లక్షల 66వేల 657 మంది ఉన్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో భాగంగా తెలుగుదేశం మద్దతుతో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ, తెలుగుదేశం, బీజేపీ విడివిడిగా పోటీపడగా త్రిముఖ పోటీ కలిసి రావడంతో ఆ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి లక్ష పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు.
2021లో జరిగిన ఉప ఎన్నికల్లో తిరిగి వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ఉప ఎన్నికల్లో మెజారిటీ కోసం అధికార వైఎస్సార్సీపీ చేసిన అరాచకాలు, దొంగఓట్ల ప్రహసనంతో ఆధ్యాత్మిక నగరం తిరుపతి పరువు మంటకలిసిపోయింది. రాష్ట్ర విభజన అనంతరం తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగిన మూడు ఎన్నికల్లో విజయం సాధించిన వైఎస్సార్సీపీ ఈ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది.
ఈ ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసే అభ్యర్థి ఎంపికలో అధికార వైఎస్సార్సీపీ పిల్లి మొగ్గలు వేసింది. సత్యవేడు శాసనసభ్యుడు కోనేటి ఆదిమూలం పేరును తిరుపతి లోక్‌సభ స్థానానికి సీఎం జగన్ తొలుత ప్రకటించారు. ఆదిమూలం పోటీకి నిరాకరించడంతో పాటు పార్టీ వీడటంతో ఆయన స్థానంలో సిట్టింగ్ ఎంపీ గురుమూర్తికి తిరిగి స్థానం కల్పించారు.
తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడటంతో పొత్తులో భాగంగా తిరుపతి పార్లమెంట్ స్థానాన్ని బీజేపీకి కేటాయించగా మాజీ ఎంపీ, ప్రస్తుత గూడూరు శాసనసభ్యుడు వరప్రసాద్ వైఎస్సార్సీపీని వీడి బీజేపీలో చేరి టికెట్ దక్కించుకున్నారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఏడు శాసనసభ స్థానాల్లో గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, తిరుపతి నియోజకవర్గాల్లో కూటమికి సానుకూల వాతావరణం ఉండగా సర్వేపల్లి, సుళ్లూరుపేట నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ, కూటమి అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు.
టీడీపీ-జనసేన Vs వైఎస్సార్సీపీ మేనిఫెస్టో - ప్రజల స్పందన ఎలా ఉందంటే - NDA Manifesto VS YsrCP Manifesto
సర్వేపల్లిలో వైఎస్సార్సీపీ తరఫున మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి, తెలుగుదేశం నుంచి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తలపడుతున్నారు. నియోజకవర్గ పరిధిలో సిలికా శాండ్ అక్రమ రవాణాతో పాటు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాకాణిపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు కాకాణిపై వ్యక్తిగతంగా ప్రజల్లో మంచి అభిప్రాయం లేకపోవడం సోమిరెడ్డికి కలిసివస్తోంది.
ఆధ్యాత్మిక క్షేత్రంలో హోరాహోరీ పోరు- గెలిచేదెవరు తిరుమలేశా? (ఈటీవీ భారత్ ప్రత్యేకం) గూడూరులో తెలుగుదేశం అభ్యర్థిగా పాశం సునీల్, వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ పోటీ చేస్తున్నారు. మేరుగ మురళీధర్ సొంతపార్టీ నేతల సహాయ నిరాకరణతో ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. వెంకటగిరిలో తెలుగుదేశం నుంచి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, వైఎస్సార్సీపీ తరపున నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి పోటీపడుతున్నారు. నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి నియంతృత్వ పోకడలు నచ్చని పలువురు వైఎస్సార్సీపీ నేతలు పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు. మరోవైపు ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంలో చేరడంతో వెంకటగిరి నియోజకవర్గంలో పరిస్థితి సానుకూలంగా మారింది.
సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం తరపున మాజీ ఎంపీ, మాజీ శాసనసభ్యుడు నెలవల సుబ్రహ్మమణ్యం కుమార్తె నెలవల విజయశ్రీ పోటీ చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య బరిలో నిలిచారు. సంజీవయ్య అభ్యర్థిత్వాన్ని స్థానిక వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించినా అధిష్ఠానం మార్చకపోవడంతో వారు ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. శ్రీకాళహస్తిలో సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యం మధుసూదనరెడ్డి భూకబ్జాలు, పారిశ్రామికవేత్తలతో మామూళ్ల దందాలతో పాటు పలు ఆరోపణలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకోవడం తెలుగుదేశం అభ్యర్థి బొజ్జల సుధీర్‌రెడ్డికి కలిసివస్తోంది.
సత్యవేడు నుంచి వైఎస్సార్సీపీ తరపున బరిలో ఉన్న నూకతోటి రాజేశ్ స్థానికేతరుడు కావడం తెలుగుదేశం అభ్యర్థి కోనేటి ఆదిమూలం ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండటంతో విజయావకాశాలు మెరుగుపడ్డాయి. కలియుగ వైకుంఠనాథుడు కొలువైన తిరుపతి నగరాన్ని తన అక్రమాలు, అరాచకాలతో వైఎస్సార్సీపీ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకరెడ్డి భ్రష్టుపట్టించారన్న విమర్శలు ఉన్నాయి. ఈసారి వైఎస్సార్సీపీ తరఫున భూమన కుమారుడు అభినయ్‌రెడ్డి పోటీలో నిలిచారు.
ఎన్డీఏ కూటమి పొత్తుల్లో భాగంగా తిరుపతి అభ్యర్థిగా జనసేన నుంచి పోటీ చేస్తున్న అరణి శ్రీనివాసులు బలిజ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడం తిరుపతిలో బలిజ ఓట్లు అధికంగా ఉండటతో కూటమి అభ్యర్థికి కలిసివస్తోంది. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఏడు శాసనసభ స్థానాల్లో అధికార వైఎస్సార్సీపీ అభ్యర్థులు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుండటంతో ఆ ప్రభావం పార్లమెంట్ అభ్యర్థిపై పడుతోంది. తిరుపతి మినహా ఆరు స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు బరిలో ఉండటం తమ అభ్యర్థుల విజయం కోసం ఆ పార్టీ శ్రేణులు శ్రమిస్తుండటంతో లోక్‌సభ కూటమి అభ్యర్థికి కలిసి వస్తోంది.
వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతో పాటు శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థులపై ప్రజల్లో సానుకూలత లేకపోవడం కూటమి అభ్యర్థికి కలిసిరానుంది. 1999 ఎన్నిల్లో తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థి విజయం సాధించిన తరహాలో ఈ ఎన్నికల్లో విజయం తథ్యమని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
'భూమి నీదే కానీ, మేం రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం- నీదైతే నిరూపించుకో!' - Land Titling Right Act