Three MPs resign from YSRCP : ఓ వైపు ముహూర్తం ముంచుకొస్తోంది. ఎన్నికల కదన రంగాన పాంచజన్యం పూరించే సమయం సమీపించింది. మరో వైపు బలమైన ప్రత్యర్థులు. మార్పు ఖాయమనే వేగుల సంకేతాలు. ఈ నేపథ్యాన తాడేపల్లి ప్యాలెస్లో వాతావరణం వేడెక్కింది. విజయమే లక్ష్యంగా, ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొనే ప్రతి వ్యూహాల రూపకల్పనలో చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. కానీ, ఎవరి లెక్కలు వారివే. అధిష్ఠానం ఒకటి ఆదేశిస్తే, అభ్యర్థులు మరోటి ఆశిస్తున్నారు. ఇరువురి నడుమ సంధి కుదరడం లేదు. సయోధ్యకు తావు లేని తరుణంలో ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఫలితంగా వైఎస్సార్సీపీలో రాజీనామాల పర్వం రక్తి కట్టిస్తోంది. రోజుకొక్కరు చొప్పున పార్టీకి దూరమవుతున్న పరిస్థితి నెలకొంది.
సన్నిహితులు, ఆత్మీయులు, కుటుంబ సభ్యుల్లాంటి వారు సైతం జగన్ వైఖరిని భరించలేక ఒక్కొక్కరుగా వైసీపీకి రాజీనామా చేస్తున్నారు. వైసీపీ ఇప్పటివరకు నాలుగు విడతలుగా అభ్యర్థుల జాబితా వెల్లడించింది. మూడు జాబితాల్లో 51మంది ఎమ్మెల్యేలు, 8మంది ఎంపీలకు స్థానచలనం కల్పించింది. ముగ్గురు ఎంపీలు, 24మంది ఎమ్మెల్యేలకు మొండిచేయి చూపించింది.
వైఎస్సార్సీపీ ఐదో జాబితాపై జగన్ కసరత్తు - సీట్లెవరివో, పాట్లెవరికో!
ముగ్గురు ఎంపీల రాజీనామా :ఇన్చార్జి పదవి నుంచి తప్పించడంతో మనస్థాపానికి గురైన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీ పెద్దల నిర్ణయంతో తాను ఎంపీ పదవికీ, వైఎస్సార్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తన నియోజకవర్గంలో ఇప్పటికీ వలసలు, ఆత్మహత్యలు కొనసాగుతుండడం బాధకలిగిస్తోందని చెప్పారు. కర్నూలు నుంచి బళ్లారి వరకు జాతీయ రహదారి కోసం ప్రయత్నించడంతో పాటు తన పరిధిలో ఉన్నంత వరకు అన్ని పనులు చేశానని తెలిపారు.