Telangana Assembly 2024 :శాసనసభ మూడు ప్రభుత్వ బిల్లులకు ఆమోద ముద్ర వేసింది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, విశ్వవిద్యాలయాల చట్టసవరణ, జీఎస్టీ చట్ట సవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది. క్రీడా విశ్వవిద్యాలయ బిల్లును ముఖ్యమంత్రి తరపున దేవాదాయశాఖా మంత్రి కొండా సురేఖ సభలో ప్రవేశపెట్టారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉద్దేశాలు, లక్ష్యాలను మంత్రి వివరించారు. ఈ దశలో బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. పరిశ్రమల కోసం భూసేకరణ, రైతుల అక్రమ అరెస్టులపై తామిచ్చిన వాయిదా తీర్మానాన్ని చర్చకు చేపట్టాలని బీఆర్ఎస్ పట్టుబట్టింది. ప్లకార్డులతో సభలో ఆందోళనకు దిగారు.
ఇదే సమయంలో ఆరు గ్యారెంటీలు అమలు చేయనందుకు తాము ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసు విషయమై బీజేపీలో పట్టుబట్టింది. ఇరు పార్టీల సభ్యులు సభలో నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే కాంగ్రెస్ సభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ క్రీడా విశ్వవిద్యాలయం బిల్లుపై చర్చలో పాల్గొన్నారు. విపక్ష సభ్యుల ఆందోళనపై స్పందించిన శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి శ్రీధర్ బాబు.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం సరికాదని, పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందో అందరికీ తెలుసని మండిపడ్డారు.
సభా హక్కుల ఉల్లంఘన నోటీసును సభాపతి నిబంధనల మేరకు చేపడతారని తెలిపారు. అనంతరం బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల ఆందోళన మధ్యే బిల్లులను ఆమోదానికి పెట్టారు. మంత్రి కొండా సురేఖ ప్రవేశపెట్టిన క్రీడా విశ్వవిద్యాలయ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. వీరనారి చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లును సీఎం తరఫున మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశపెట్టారు. జీఎస్టీ చట్ట సవరణ బిల్లును మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రవేశపెట్టారు. బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసన మధ్య రెండు బిల్లులపై ఎలాంటి చర్చ లేకుండానే శాసనసభ ఆమోదం తెలిపింది. పర్యాటక విధానంపై స్వల్ప చర్చ అనంతరం సభను రేపటికి శాసనసభాపతి వాయిదా వేశారు.