Chandrababu Fire on YSRCP Attacks : ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సతీమణి భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణితో కలిసి ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో దాడులపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు చంద్రబాబు చెప్పారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, ఈసీ బాధ్యత తీసుకోవాలన్నారు.
ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరిన చంద్రబాబు ఓటు వేసేందుకు జనం చూపిస్తున్న చొరవ మరచిపోలేనిదని అన్నారు. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల్లో జనం బారులు తీరారని, ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవి, భవిష్యత్తును తీర్చిదిద్దేది ఈ ఎన్నికలే అని జనం గుర్తించారని తెలిపారు. ఓటు మీ జీవితాన్ని మారుస్తుందని, భావితరాలకు, భవిష్యత్తుకు పునాదులు వేస్తుందని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లోని తెలుగువారు కూడా ఓటు వేసేందుకు వస్తున్నారని, విదేశాల నుంచి కూడా ఓటు వేసేందుకు తరలి వస్తున్నారని, అశ్రద్ధ చేయకుండా ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు. సుపరిపాలనకు ఓటు నాంది పలకాలని చంద్రబాబు పేర్కొన్నారు.