Telangana Lok Sabha Election Results 2024 :నువ్వా నేనా అంటూ సాగిన పార్లమెంట్ ఎన్నికల ఘట్టం తుది అంకానికి చేరుకుంది. ఇవాళ ఉదయం 5గంటల నుంచే స్ట్రాంగ్ రూముల వద్ద సందడి మొదలైంది. ఆ తర్వాత లెక్కింపులో పాల్గొనే ఉద్యోగులకు విధుల కేటాయింపులు జరిగిపోయాయి. 8గంటలకు ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. సమాంతరంగా పార్లమెంటు పరిధిలో పోలైన మొత్తం తపాలా ఓట్లను లెక్కిస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంటు స్థానాలతో కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో మొత్తం 155 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. హైదరాబాద్ ఎంపీ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీల ఓట్లను 7 లెక్కింపు కేంద్రాల్లో, సికింద్రాబాద్ ఎంపీ స్థానంలోని 7 అసెంబ్లీల ఓట్లను 6కేంద్రాల్లో, కంటోన్మెంట్ అసెంబ్లీ ఓట్లను ఓ చోట, మల్కాజిగిరి ఎంపీ పరిధిలోని 7 అసెంబ్లీల ఓట్లను 3చోట్ల, చేవెళ్ల ఎంపీ పరిధిలోని 7అసెంబ్లీల ఓట్లను ఒకే ప్రాంగణంలో లెక్కిస్తున్నారు.
మొదటి ఫలితం సికింద్రాబాద్దే : నాలుగు పార్లమెంట్ స్థానాల్లో మొదటి ఫలితం సికింద్రాబాద్దే వెలువడనుంది. సాయంత్రం 4గంటల కల్లా విజేత, మెజారిటీ చెప్పే అవకాశముంది. ఇక్కడ ఏడు అసెంబ్లీ స్తానాల్లో గరిష్ఠంగా ముషీరాబాద్, నాంపల్లి ఓట్లను 20రౌండ్లలో, మిగత ఐదు స్థానాల ఓట్ల లెక్కింపు 17,18 రౌండ్లలో పూర్తవుతుంది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ విజేత మెజారిటీ సాయంత్రం 5.20గంటలకు తేలే అవకాశముంది. ఈ స్థానం పరిధిలోని యాఖుత్పుర సెగ్మెంట్ ఓట్లను 24 రౌండ్లలో లెక్కిస్తారు. మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలిచారన్న విషయం సాయంత్రం 4.40గంటల్లోపు తెలిసిపోతుంది. చేవెళ్ల ఎంపీ మెజార్టీపై 5గంటలకు స్పష్టత వచ్చే అవకాశముంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఎవరు, ఎంత మెజార్టీతో గెలిచారో మధ్యాహ్నం 3గంటలకల్లా తెలిసిపోతుంది.
20నిమిషాలకో ఒక రౌండ్ ఫలితాలు :నియోజకవర్గాల ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు రౌండ్ల వారీగా జరుగుతుంది. ఒక్కో రౌండ్ లెక్కింపు పూర్తయ్యే సరికి 20నిమిషాల సమయం పడుతుందని అధికారులు అంచనా వేశారు. ఆ లెక్కన ఆయా నియోజకవర్గాల ఫలితారలు వెల్లడయ్యే సమయాన్ని అధికారులు తెలిపారు. అయితే ఏదేనీ రౌండులో లెక్కించాల్సిన ఓట్లకన్నా అభ్యర్థికి దక్కిన మెజారిటీ ఎక్కువగా ఉన్నట్లు తేలితే వాగి గెలుపు ఖాయమైనట్లే, కానీ అందుకు అన్ని రౌండ్లు లెక్కించాలి అప్పుడే పూర్తీ మెజార్టీ తెలుస్తుంది. తర్వాత సదరు రిటర్నింగ్ అధికారి అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తూ ధ్రువీకరణ పత్రాన్ని వారికి అందజేస్తారు.