TG High Court on IMG Land Case : ఐఎంజీ భూముల వ్యవహారంపై సీబీఐ విచారణ కోరుతూ విజయసాయిరెడ్డి సహా పలువురు 2012లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే.శ్రీనివాసరావు ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన వ్యక్తుల పూర్వపరాలనూ పరిశీలించాల్సి ఉందని విచారణ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది.
పిటిషనర్లలో ఒకకరైన విజయసాయిరెడ్డి, వైఎస్ రాజశేఖర్రెడ్డి కుటుంబం సలహాదారు అని హైకోర్టు తెలిపింది. జగన్ ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభకు ఎంపికయ్యారని పేర్కొంది. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు జరిపిన భూకేటాయింపులపై సీబీఐ దర్యాప్తు జరిపించాలంటూ వైఎస్ విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్‌లో ఐఎంజీ వ్యవహారం ఉందని న్యాయస్థానం వెల్లడించింది. ఇందులో ఐఎంజీ ఎండీ అహోబిలరావు ప్రతివాదులుగా ఉన్నారని గుర్తు చేసింది. హైకోర్టుతోపాటు, సుప్రీంకోర్టు కూడా విజయమ్మ పిటిషన్‌ను కొట్టివేసిందని ధర్మాసనం వెల్లడించింది.