Benefits of Silence: ప్రస్తుత ఆధునిక సమాజంలో నిశ్శబ్దం అనేదే కరవైంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఇంటా బయటా ఎక్కడ చూసినా శబ్ద ప్రపంచమే రాజ్యమేలుతోంది. ఒక్కసారి కళ్లు మూసుకొని చుట్టుపక్కల శబ్దాలను వినండి! ఏదో ఒక చప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. సోషల్ మీడియా రాకతో ఈ సమస్య మరింత ఎక్కువైంది. ఏమాత్రం సమయం దొరికినా మొబైల్ ఫోన్లలో తల దూర్చి.. వీడియోలు చూడటమో, పాటలు వినటమో ఏదో ఒకటి చేస్తూనే ఉంటున్నారు. కొన్నిసార్లు ఇది రోజువారీ పనులకూ విఘాతం కలిగిస్తుంది. నిరంతం రకరకాల చప్పుళ్లతో ఒత్తిడి, మానసిక అలసట, ఇతరులతో కలవక పోవటం వంటి విపరీత పరిణామాలకూ దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలోనే నిశ్శబ్దం ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఫలితంగా మనసును ప్రభావితం చేసే బాహ్య ప్రేరకాల నుంచి తప్పించుకుని.. కోల్పోయిన ఏకాగ్రతను తిరిగి పొందొచ్చని చెబుతున్నారు. లోతైన ఆలోచనలతో మానసిక ప్రశాంతతకే కాకుండా వ్యక్తిగతంగా ఎదగటానికీ తోడ్పడుతుందని వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

- ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని గాఢంగా శ్వాస తీసుకోవాలి. ఆ తర్వాత ఆరోజు ఉద్దేశాన్ని నిర్ణయించుకోవాలి.
- నిశ్శబ్దంగా గడపటాన్నీ ముఖ్యమైన పనిగా భావించాలి. అవసరమైతే క్యాలెండర్‌లో సెట్ చేసుకోవాలి. కొద్ది నిమిషాలు నిశ్శబ్దంగా ఉన్నా పెద్ద మార్పే కనిపిస్తుంటుంది. అందుకే ఉదయం కాఫీ తాగేటప్పుడో, రాత్రి పడుకోబోయే ముందో వీలైన ఎక్కువ సమయాన్ని కచ్చితంగా నిశ్శబ్దంగా గడపటానికి ప్రయత్నించాలి.
- ఇంకా ఇంట్లో ఒక ప్రత్యేక స్థలాన్ని ఎంచుకోవటం మంచిది. కిటికీ పక్కనో లేదా ఏదో ఒక మూలనో కుర్చీ వేసుకొని నిశ్శబ్దంగా గడపాలి. ఈ స్థలం ప్రశాంతంగా ఉండటానికే ప్రత్యేకమని మనసులో అనుకోవాలి.
- ఇంట్లో వాళ్లకు ఆయా సమయాల్లో మౌనాన్ని పాటిస్తున్నామనే సంగతిని చెప్పాలి. ఇది ఒంటరిగా ఉండటం కాదని, నిశ్శబ్దంగా ఉండటానికి విలువైన సమయాన్ని కేటాయించటమేనని స్పష్టంగా వివరించాలి. ఫలితంగా అనవసరంగా జోక్యం చేసుకోవటం తగ్గి.. ప్రశాంతత అవసరాన్ని అర్థం చేసుకోవటానికి, గౌరవించటానికి తోడ్పడుతుందట.
- ముఖ్యంగా ధ్యానం చేస్తున్నప్పుడు, యోగాసనాలు వేస్తున్నప్పుడు చుట్టుపక్కల శబ్దాలు లేకుండా చూసుకోవాలి. శ్వాస మీద ధ్యాస పెట్టటం, శరీర అవయవాలను గమనిస్తూ నిశబ్ద క్షణాలను ఆస్వాదించాలి.
- ఉరుకుల పరుగుల వ్యవహారాలతో గడిపేవారు ముందుగా తక్కువ సమయంతో ఆరంభించాలి. రోజును మొదలు పెట్టటానికి ముందు లేదా పని పూర్తయ్యాక ఒక్క నిమిషం ప్రశాంతంగా గడిపినా సానుకూల ప్రభావం కనిపిస్తుంది.
- పార్కులోనో, తోటలోనో సహజ నిశ్శబ్దాన్ని సాధన చేస్తూ ఆ క్షణం మీద దృష్టి సారించాలి.
- కుర్చీలో కూర్చొని కాల్పనిక కథలు చదవాలి. ఫలితంగా సానుభూతి, భావోద్వేగ వివేచన పెంపొదుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
- ఇంకా రాత్రి పడుకునే ముందు ప్రశాంతంగా ఎంత సేపు గడిపామో విశ్లేషించుకోవాలి. ఆ సమయంలో కలిగిన అనుభూతులను నెమరు వేసుకుని.. వీలైతే డైరీలోనూ రాసుకోవాలి.
- వీలైనంత త్వరగా రాత్రి నిద్రకు ఉపక్రమించాలి. హాయిని చేకూర్చే సాగదీత వ్యాయామాలు లేదా మంచం మీద వేసే ఆసనాలు సాధన చేస్తుండాలి.
- ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌ల వంటి వాటికి వీలైనప్పుడల్లా విరామం ఇస్తుండాలి. వీటికి బదులు పుస్తకం చదవటం, చెట్ల మధ్య నడవటం, ప్రశాంతంగా కూర్చోవటం, చుట్టుపక్కలను గమనిచడం చేయాలి. నిరంతరం వచ్చి పడే నోటిఫికేషన్లు, ఇబ్బడి ముబ్బడి సమాచారాన్ని కాస్త పక్కన పెడితే మానసిక ప్రశాంతత లభిస్తుంది.
- కష్టంగా అనిపించినప్పటికీ కారును నిశ్శబ్ద ప్రాంతంగా పరిగణించటమూ మేలు చేస్తుందట. శబ్ద, నిశ్శబ్ద ప్రపంచాలను వేరు చేసుకోవటానికిది దోహదపడుతుంది.
- అన్ని అలవాట్ల మాదిరిగానే నిశ్శబ్దంగా ఉండటాన్నీ నెమ్మదిగానే ప్రారంభించాలి. ఆచరణకు వీలైన చిన్న మార్పులతోనే ఆరంభించాలి.


నిశ్శబ్దంతో ఆరోగ్య ప్రయోజనాలు
- రక్తపోటు తగ్గుతుంది.
- ఏకాగ్రత, తదేక దృష్టి పెరుగుతాయి.
- గజిబిజి ఆలోచనలకు కళ్లెం పడుతుంది.
- మెదడు వృద్ధిని ప్రేరేపిస్తుంది.
- ఒత్తిడిని కలగజేసే కార్టిజోల్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది.
- సృజనాత్మక శక్తి ఇనుమడిస్తుంది.
- నిద్రలేమి సమస్య దూరమవుతుంది.

పరిశోధనలేం చెబుతున్నాయి?
2021లో జరిగిన ఒక అధ్యయనంలో నిశ్శబ్ద వాతావరణంలో, మాట్లాడుతూ లేదా చుట్టుపక్కల రణగొణ ధ్వనుల మధ్య ఏకాగ్రతతో చేయాల్సిన పనులను 59 మందికి పరిశోధకులు అప్పగించారు. నిశ్శబ్ద వాతావరణంలో పనిచేసినవారిలో మెదడు మీద మరీ ఎక్కువగా భారం పడటం లేదని, ఒత్తిడి స్థాయులూ తక్కువగా ఉంటున్నాయని కనిపెట్టారు.
2013లో ఎలుకల మీద నిర్వహించిన పరిశోధనలో రెండు గంటల నిశ్శబ్దం మూలంగా మెదడులో జ్ఞాపకశక్తి, భావోద్వేగాలతో ముడిపడిన హిప్పోక్యాంపస్‌లో కొత్త కణాల వృద్ధి ప్రేరేపితమవుతున్నట్టు తేల్చారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
2006లో చేపట్టిన అధ్యయనంలో- సంగీతాన్ని విన్న తర్వాత 2 నిమిషాల సేపు నిశ్శబ్దాన్ని పాటిస్తే గుండె వేగం, రక్తపోటు గణనీయంగా తగ్గుతున్నట్టు వెల్లడైంది. వీటి విషయంలో మంద్ర, ప్రశాంతతను కలిగించే సంగీతాన్ని వినటం కన్నా నిశ్శబ్దమే మరింత ఎక్కువ ఫలితం చూపిస్తున్నట్టు తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఇంకా 2003లో చేసిన పాత అధ్యయనంలో చాలాకాలంగా రణగొణ ధ్వనుల ప్రభావానికి గురైతే గుండె వేగం, రక్తపోటు పెరుగుతున్నట్టు బయటపడింది.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఎటు వైపు తిరిగి పడుకుంటే మంచిది? అలా నిద్రపోతే గురకతో పాటు అనేక సమస్యలకు చెక్!
త్వరగా అలసిపోతున్నారా? ఇవి తింటే ఫుల్ ఎనర్జీతో ఉంటారట! అవేంటో తెలుసా?