Telangana Election Campaign in Social Media : లోక్‌సభ ఎన్నికల వేళ సోషల్ మీడియా వేదికగా పార్టీల రాజకీయ పోరు తీవ్ర స్థాయిలో సాగుతోంది. ఇందుకోసం వైరల్ అయ్యే సత్తా ఉన్న కంటెంట్‌ను పట్టుకోవాలి. ప్రత్యర్థుల ప్రసంగాలు, సభల్లోని లోటుపాట్లను గుర్తించి, వాటికి తగిన సినిమా దృశ్యాలనో, ఫొటోలనో జోడించి సామాజిక మాధ్యమాల్లో (Campaign in Social Media) ఊదరగొడుతున్నారు. అందులో కాస్త నవ్వింపు, కవ్వింపు ఉండాలి. ఎదుటివారిపై ఏహ్యభావం, తమ వారిపై సానుకూల దృక్పథం కలిగించగలగాలి. తమ అభిమానులను అలరించాలి ఇన్ని లక్ష్యాలతో సామాజిక మాధ్యమాల్లో పార్టీలు, అభ్యర్థులు, వారి తరఫు టీంలు చెలరేగిపోతున్నాయి. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో పరిమితులులేని ఈ ఆన్‌లైన్ ప్రచారం చేసుకున్నోళ్లకు చేసుకున్నంతగా మారిపోయింది. కొత్త ఉపాధి మార్గాలను చూపుతోంది.
Lok Sabha Elections 2024 : ఓటర్లలో పట్టు పెంచుకునేందుకు పార్టీ స్థాయిలోనే కాకుండా అభ్యర్థులు కూడా వార్ రూంలను తెరుస్తున్నారు. మరోవైపు పలుకుబడి ఉన్న యూట్యూబర్లు, గ్రూప్‌ల అడ్మిన్ల కోసం గాలిస్తున్నారు. కొన్ని స్థానాల్లో మినహా ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయడంతో వారం రోజులుగా ప్రచారం దుమ్మురేగుతోంది. సంప్రదాయ మీడియాలో ప్రసారానికి వీలులేని బూతులు, వివాదాస్పద వ్యాఖ్యలను సోషల్ మీడియాలో యథేచ్ఛగా పోస్టు చేస్తూ పలువురు నేతలు రచ్చ చేస్తున్నారు.
ప్రచారంలో నయా రూట్ - ఏఐ టెక్నాలజీతో ఖర్చు తగ్గించుకుంటున్న అభ్యర్థులు
ప్రస్తుతం తెలంగాణలో ఏర్పడిన క్షామ పరిస్థితులపై సోషల్ మీడియాలో (TS Election Campaign 2024 )రచ్చ జరుగుతోంది. ఈ పరిస్థితికి మీరే కారణమంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. పంటల సాగు, తాగునీటి సమస్యలు, ఎండిపోయిన జలాశయాలు, నీటి ఎద్దడి, కరవు, రైతు ఆత్మహత్యలు, వర్షాభావం తదితర సమాచారం, చిత్రాలు, వీడియోలను పోస్టు చేసి ప్రత్యర్థికి ఊపిరిసలపకుండా చేస్తున్నారు.
మీమ్స్ - పచ్చిపచ్చిగా : మరోవైపు ఎప్పుడూ లేనంతగా ప్రతికూల అంశాలపై రచ్చ చేయడం ప్రస్తుతం కనిపిస్తోంది. గత సంవత్సరం చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం తీరు తారస్థాయికి చేరినా వ్యాఖ్యల తీవ్రత ఇప్పటిలా లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. అసభ్య పదాలు, హత్యా రాజకీయాలకు సంబంధించి పలు చిత్రాలు, వ్యాఖ్యలను కొన్ని పార్టీల నేతలు యథేచ్ఛగా వినియోగిస్తున్నారు.