Bhatti Vikramarka ChitChat on Telangana Issues :ఇటీవల దేశంలో జరిగిన ఎన్నికలు, వచ్చిన ఫలితాలను ఆధారంగా చూస్తే బీజేపీకి ప్రజల్లో ఆదరణ క్రమంగా తగ్గి కాంగ్రెస్‌కు పెరుగుతున్నట్లు స్పష్టం అవుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. గాంధీభవన్‌లో బుధవారం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన, రాజకీయ అంశాలతోపాటు రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధికి చెందిన అంశాలు, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు తదితర వాటిపై స్పందించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కువగా గెలిచారని తెలిపారు.
మధ్యప్రదేశ్‌లో బీజేపీ మంత్రిని కాంగ్రెస్ అభ్యర్థి ఓడించారని గుర్తు చేసిన భట్టి, రైతు భరోసా విదివిధానాలపై కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కేటీఆర్ గత కొన్ని రోజులుగా సీఎంను, ప్రభుత్వాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తాము బీఆర్ఎస్ మాదిరి నిర్బంధ పాలన చేయడం లేదని, ప్రజల కోసం తాము ద్వారాలు తెరిచి ఉంచామన్నారు. రాష్ట్రంలో భావ స్వేచ్ఛ, అందరికీ స్వతంత్రాన్ని ఇచ్చే ప్రజా పాలన కొనసాగుతోందన్నారు. పది సంవత్సరాలపాటు మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌కు కనీస సంస్కారం లేకుండా కలెక్టర్‌ను సన్యాసి అని మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. అందుకే ఆయన మతి స్థిమితం కోల్పోయినట్లు భావిస్తున్నట్టు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒకటి తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నట్లు పేర్కొన్న భట్టి విక్రమార్క, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించిన ప్రభుత్వం ప్రతి నెల వారికోసం రూ.400 కోట్లు ఆర్టీసీకి చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తూ వారి పక్షాన ప్రభుత్వం నెలకు రూ. 150 కోట్లు చెల్లిస్తున్నట్లు చెప్పారు. త్వరలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేస్తామని తెలిపారు. రెండు లక్షల రుణమాఫీ విషయంలో అనుకున్న సమయంలో చేశామన్న ఆయన, ఇంకా కొన్ని వివిధ కారణాల వల్ల మాఫీ కాలేదని, వాటిని కూడా చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
పాఠశాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు సందర్శన : గడిచిన 10 సంవత్సరాలల్లో రేషన్ కార్డులు ఇవ్వకుండా ప్రజలను ఇబ్బంది పెట్టింది ఎవరని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఇప్పుడు తాము ఇవ్వబోతుంటే విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి ఆర్థిక వ్యవస్థను బీఆర్ఎస్ తీసుకొచ్చినా తాము 15 రోజుల్లోనే రైతుల ఖాతాలో రూ.18 వేల కోట్లు జమ చేశామని, ఇది రికార్డ్ బ్రేక్ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం రాష్ట్రంలో కులగణన చేస్తుంటే కులాలను విడగొడుతున్నట్లు విపక్షాలు విమర్శలు చేయడం సరికాదన్నారు. తాము రాష్ట్రంలో కులాలవారీగా ఎంత మంది ఉన్నారో గణాంకాలు తేలుస్తామని, ఆ తరువాత మేధావి వర్గంతో చర్చించి ముందుకు వెళ్లతామని వెల్లడించారు.