Telangana Congress New PCC Chief Selection : పీసీసీ అధ్యక్షుడి పేరు దాదాపు ఖరారు అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం రోజంతా దిల్లీలో పార్టీ అధిష్ఠానంతో పలు దఫాలు సమావేశమైన రాష్ట్ర నాయకులు పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చర్చించినట్లు తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెంది ప్రచార కమిటీ సభ్యుడు మధుయాస్కీ గౌడ్, ప్రస్తుత కార్యనిర్వహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్ పేరు తెరపైకి వచ్చింది.
ఎస్సీ సామాజికవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్లు కూడా చర్చకు వచ్చాయి. ఇందులో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క, స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రిగా దామోదర రాజనర్సింహ ఉండడంతో పీసీసీ చీఫ్ ఆ సామాజిక వర్గానికి దక్కే అవకాశం లేదని సమాచారం. ఎంపీ బలరామ్ నాయక్ ఎంపీగా ఉంటూ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఏ మేరకు అవకాశం ఉంటుందన్న అంశంపై చర్చించినట్లు సమాచారం.
సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు అభిప్రాయాలను వేర్వేరుగా అధిష్ఠానానికి చెప్పినట్లు సమాచారం. అత్యధిక జనాభా కలిగిన బీసీ సామాజికవర్గం నుంచి పీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న ఇద్దరు గౌడ సామాజిక వర్గానికి చెందిన మహేష్‌కుమార్ గౌడ్, మధుయాస్కీలు నువ్వానేనా అన్నట్లుగా పోటీపడుతున్నట్లు సమాచారం. వీరిద్దరిలో ఒకరికి పీసీసీ అధ్యక్ష పదవి దక్కే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ దిల్లీ వెళ్లినప్పటికీ ఆమె అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకోలేదని పార్టీ వర్గాలు తెలిపాయి.
మహేశ్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు : త్వరలో అదనపు ఇన్‌ఛార్జీ బాధ్యత నుంచి ఆమెను తప్పించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీలో ఎలాంటి వివాదం లేకుండా డీఫ్యాక్టో పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న మహేశ్ కుమార్ గౌడ్ వైపు పార్టీ పెద్దలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, వేణుగోపాల్‌తో రాష్ట్ర నాయకులు తమ అభిప్రాయాలను తెలియచేసినందున తుది నిర్ణయం అధిష్ఠానం తీసుకోవాల్సి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.