Telangana Congress Joinings 2024 : కాంగ్రెస్ సర్కార్ త్వరలోనే కూలిపోతుందంటూ బీఆర్ఎస్, బీజేపీకి చెందిన కొందరు నాయకులు చేసిన ప్రకటనలు ఆ పార్టీని కలవరపాటుకు గురి చేశాయి. తమ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చలేరన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అలాంటి కుట్రల్ని ఛేదిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడం సహా పార్టీని బలోపేతం చేయడం లక్ష్యంగా హస్తం పార్టీ అధిష్ఠానం చేరికలకు గేట్లు తెరిచింది.
TS Congress Operation Akarsh 2024 : ఇందులో భాగంగానే బీఆర్ఎస్, బీజేపీకి చెందిన నాయకుల్ని వరుసగా కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారు. భారత్ రాష్ట్ర సమితి చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరి లోక్‌సభ (TS Congress MP Candidates) బరిలో నిలిచారు. గులాబీ పార్టీని వీడి హస్తం గూటికి వచ్చిన వికారాబాద్ జడ్పీ ఛైర్మన్ సునీతా మహేందర్‌రెడ్డికి మల్కాజిగిరి టికెట్ లభించింది. ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సికింద్రాబాద్ లోక్‌సభ టికెట్ దక్కించుకున్నారు.
కాంగ్రెస్‌లో చేరనున్న కేశవరావు : వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ హస్తం గూటికి చేరారు. బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకుని పదవి దక్కించుకున్నారు. గులాబీ పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడుకే.కేశవరావు (KK To Join Congress) కూడా బీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చారు. ఆయన తన కుమార్తె, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మితో కలిసి శనివారం కాంగ్రెస్‌లో చేరనున్నారు. తాను సుదీర్ఘ కాలం హస్తం పార్టీలో పనిచేశానని జీవిత చరమాంకంలో తిరిగి అదే పార్టీకి వెళ్లనున్నట్లు కేశవరావు స్పష్టంచేశారు.
అధికార పార్టీలో ఉంటేనే పనులు అవుతాయని సమస్యలు పరిష్కరించడం సులువుగా ఉంటుందని హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి మీడియాతో ఇష్టాగోష్టిలో అన్నారు. అందుకే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు తెలిపారు. తన వెంట కార్పొరేటర్లు ఎవరినీ తీసుకుపోవడం లేదని విజయలక్ష్మి పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి బీఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన కూడా కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరుగుతోంది.