BJP Leaders Comments on Congress : తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలతో పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Lok Sabha Elections 2024 : తాజాగా ఇవాళ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని గాంధీనగర్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. కేంద్రం ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. రాజ్యాంగానికి అనుగుణంగా పాలన చేసేది తమ పార్టీనేనని అన్నారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచింది కాంగ్రెస్ పార్టీ అని బండి సంజయ్ విమర్శించారు.
Bandi Sanjay Fires on Congress : రాజ్యాంగానికి సవరణలు చేయాలని కేసీఆర్ చెప్పారని బండి సంజయ్ అన్నారు. కానీ ఆయన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఏనాడూ ఖండించలేదని ఆరోపించారు. అంబేడ్కర్ జయంతి రోజున కేసీఆర్ రాకపోతే బీజేపీ ప్రశ్నించిందని గుర్తు చేశారు. గత ముఖ్యమంత్రి విధానాలపై హస్తం పార్టీ ఏనాడూ ప్రశ్నించలేదని విమర్శించారు. మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేసి పేదలకు ఇస్తామని అమిత్ షా చెప్పారని, ఆ వ్యాఖ్యలను వక్రీకరించి కొందరూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేశంలో మోదీ మరోమారు ప్రధాని కావాలని, కరీంనగర్‌లోనూ ప్రజలు తనను దీవించాలని బండి సంజయ్ ఓటర్లను కోరారు.
"రిజర్వేషన్ల రద్దు పేరుతో ప్రజల్లో భయాందోళనలు కలిగించి కాంగ్రెస్ లబ్ధి పొందాలని చూస్తొంది. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అవమానించింది కాంగ్రెస్సే. మతపరమైన రిజర్వేషన్లను మాత్రమే రద్దు చేసి వాటిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణ పేదలందరికి పంచుతామన్నారు. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తెలియని వ్యక్తి. ఆరు గ్యారంటీల అమలు దృష్టి మల్లించేందుకే కాంగ్రెస్ ఈ కుట్రలు పన్నుతుంది. ఇక బీఆర్ఎస్ పని ముగిసింది." - బండి సంజయ్, కరీంనగర్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి