Telangana Assembly Sessions Update Today : ప్రాజెక్టుల అప్పగింతకు గత ప్రభుత్వమే అంగీకరించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల అప్పగింత తర్వాత కేంద్రం నిర్వహణకు నిధులు కేటాయించారని తెలిపారు. కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల నిర్వహణకు రూ.200 కోట్ల చొప్పున నిధులు ఇచ్చారని ఆరోపించారు. ఈనెల 13వ తేదీన ఎమ్మెల్యేలు అందరం మేడిగడ్డకు వెళ్దామని సీఎం అన్నారు. ఎమ్మెల్యేలు అందరం మేడిగడ్డ(Medigadda Barrage)ను పరిశీలించి వస్తామని స్పష్టం చేశారు. ప్రాజెక్టు సందర్శనను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని, మేడిగడ్డ మేడిపండు గొప్పదనాన్ని అందరం చూసి వద్దామని పేర్కొన్నారు.
Harish Rao Counter To CM Revanth :మరోవైపు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) ఖండించారు. బడ్జెట్‌లో తాము ప్రతిపాదించిన విషయం నిజమేనని, కానీ కేఆర్ఎంబీకి కొన్ని షరతులు విధించామని, అందుకు ఒప్పుకుంటేనే బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేశామని చెప్పినట్లు తెలిపారు. కానీ కేఆర్ఎంబీ తమ షరతులకు ఒప్పుకోకపోవడంతో ఒక్క రూపాయి ఇవ్వలేదని హరీశ్ రావు స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యయనానికి నిపుణుల కమిటీ ఏర్పాటుకు సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం
"మేం కేఆర్ఎంబీ, కేంద్రానికి కొన్ని షరతులు విధించాం. మా కండీషన్లు ఒప్పుకుంటేనే బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించడానికి అనుమతిస్తామని చెప్పాం. కృష్ణాలో 50:50 నిష్పత్తిలో నీటి వాటా కోరాం. పోతిరెడ్డి పాడుకు 34 టీఎంసీల కంటే చుక్క నీరు ఎక్కువ తీసుకుపోవడానికి వీల్లేదని తేల్చి చెప్పాం. శ్రీశైలం ఎండీడీఎల్ 830 మెయింటైన్ చేయాలని, తాగునీటిలో 20 శాతం అకౌంటెబిలిటీ చేయాలని చెప్పాం. ఇవన్నీ ఒప్పుకుంటేనే బోర్డుకు ఇవ్వడానికి అభ్యంతరం లేదని చెప్పాం. అందుకే బడ్జెట్‌లో ప్రతిపాదనలు పెట్టాం. కానీ వారు మా షరతులు అంగీకరించలేదు. అందుకే మేం ఒక్క రూపాయి కూడా వారికి ఇవ్వలేదు."- హరీశ్ రావు, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి