CM Chandrababu Fire on Jagan Comments :ఈ నెల 22 (సోమవారం) నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర అభివృద్ధే ప్రధాన అజెండాగా పోటీ పడి పని చేయాలని ఎంపీలకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పలు రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
వైఎస్సార్సీపీ అబద్ధపు విష ప్రచారాన్ని తిప్పికొడదాం :అసెంబ్లీ నుంచి పారిపోయేందుకే మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి దిల్లీ డ్రామాలని చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. శాంతి భద్రతలపై ప్రభుత్వం పెట్టే శ్వేతపత్రంలో వాస్తవాలు ఎదుర్కొనే ధైర్యం జగన్‌కు లేదని అన్నారు. జగన్ పెంచి పోషించిన గంజాయి, మాదక ద్రవ్యాల సంస్కృతి వల్లే ఈ అనర్ధాలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు. జగన్ పోతూ పోతూ ఖజానా మొత్తం ఖాళీ చేసి పోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకటి, రెండు కార్పొరేషన్లకే నిధులన్నీ మళ్లించేశాడని విమర్శించారు. నిర్మాణాత్మకంగా రాష్ట్రాభివృద్ధిని సవాల్‌గా తీసుకుని పని చేద్దామని పిలుపునిచ్చారు.
పల్నాడు జిల్లా వినుకొండలో రషీద్ హత్య గంజాయి ప్రభావం వల్లే జరిగిందని వైఎస్సార్సీపీ నేతలూ ఒప్పుకున్నారని చంద్రబాబు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో నేతలంతా క్రమశిక్షణగా వ్యవహరించాలని సూచించారు. వైఎస్సార్సీపీ అబద్ధపు విష ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొడదామని అన్నారు. వ్యక్తిగతదాడులకు జగన్ రాజకీయ రంగు పులుముతున్నారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడొద్దు, పోలీసులు కఠినంగా ఉండాలని తెలిపారు. తప్పులు చేసి తప్పించుకుంటామంటే కుదరదని తేల్చిచెప్పారు.
జగన్ హింసా రాజకీయాలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తప్పుచేస్తే తప్పించుకోలేం అనే భయం కల్పిస్తామని స్పష్టం చేశారు. శాంతిభద్రతల కంటే తనకు ఏదీ ముఖ్యం కాదని తెలిపారు. ప్రజలు తిరస్కరించినా జగన్ ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదని విమర్శించారు. జగన్ బెదిరింపులకు భయపడం కుట్రలను సాగనివ్వమని హెచ్చరించారు. టీడీపీ అంటేనే బెస్ట్ లా అండ్ అర్డర్ అని, దాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదన్నారు. మత ఘర్షణలు, ఫ్యాక్షన్, నక్సలిజం, రౌడీయిజాన్ని అదుపు చేసిన చరిత్ర టీడీపీదన్నారు. మహిళలపై అఘాయిత్యాలు చేయాలంటే భయపడే పరిస్థితి తెస్తామని వెల్లడించారు.