TDP Membership 90 Lakhs Completed :టీడీపీ సభ్యత్వ నమోదుకు పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. ఆన్‌లైన్‌లో డిజిటల్ విధానంలో దీనిని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని నేతలు, కార్యకర్తలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. పాతవారు రెన్యువల్ చేసుకుంటుండగా కొత్తవారిని చేర్చుకుంటున్నారు.
తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు 90 లక్షల మైలురాయిని దాటాయి. సీఎం, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్టోబరు 26న ప్రారంభించారు. టీడీపీ నమోదు ప్రక్రియ గతంతో పోలిస్తే రికార్డు స్థాయిలో దూసుకుపోతుంది. ఏపీ, తెలంగాణ, అండమాన్-నికోబార్‌లలో కలిపి నూతనంగా చేరిన వారు, పాత సభ్యత్వాల్ని పునరుద్ధరించుకున్న వారు ఇందులో ఉన్నారు. త్వరలోనే కోటి సభ్యత్వాలు పూర్తి చేస్తామని తెలుగుదేశం పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెలాఖరుతో నమోదు ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నా, కార్యకర్తల సూచనల మేరకు సంక్రాంతి వరకు పొడిగించే అవకాశం ఉందని తెలిపాయి.
పార్టీ జెండా మోసేది కార్యకర్తలే - వారిని నిత్యం గౌరవించాలి: నేతలతో చంద్రబాబు
ఏపీలో నెల్లూరు నగరం 1,44,699 సభ్యత్వాలతో అగ్రస్థానంలో నిలిచింది. పాలకొల్లు (1,42,482), ఆత్మకూరు (1,32,610), రాజంపేట (1,29,467), కుప్పం (1,25,255), ఉండి (1,13,247), గురజాల (1,08,077), వినుకొండ (1,04,141), మంగళగిరి (1,02,771), కల్యాణదుర్గం (98,899) అసెంబ్లీ నియోజకవర్గాలు టాప్-10లో నిలిచాయి. యువత నుంచి పెద్ద సంఖ్యలో స్పందన వస్తోందని, గత 3 రోజుల్లోనే ఐదు లక్షల సభ్యత్వాలు నమోదు అయినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
TDP Membership in venkatapuram :ఈ క్రమంలోనే దివంగత నేత, పరిటాల రవీంద్ర స్వగ్రామం వెంకటాపురం కొత్త చరిత్ర సృష్టించింది. ఆ గ్రామంలో వంద శాతం ఓటర్లు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. వెంకటాపురం గ్రామం శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరి మండలం నసనకోట పంచాయతీ 225 పోలింగ్ బూత్ పరిధిలో ఉంది. గ్రామ జాబితాలో మొత్తం 581 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 11 మంది మరణించారు. మిగిలిన 570 మందిలో అందరూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వందశాతం టీడీపీ సభ్యత్వం తీసుకున్న మొదటి గ్రామంగా వెంకటాపురం నిలిచింది.
పరిటాల స్వగ్రామం పసుపుమయం - ఏం జరిగిందంటే!