How to Overcome Restless Leg Syndrome : కొంతమందికి కాళ్లలో ఏదో పాకుతున్నట్టు, దురద పెడుతున్నట్లుగా ఉంటుంది. లేదంటే లాగుతున్నట్టో, మండుతున్నట్టో, సూదులతో పొడుస్తున్నట్టో కూడా అనిపించొచ్చు. మొత్తమ్మీద ఏదో అసౌకర్యంగా అనిపిస్తుంటుంది. దీంతో వెంటనే అప్రయత్నంగా కాళ్లను కదిలిస్తుంటారు. ఇలా అదేపనిగా కాళ్లను కదిపే ప్రాబ్లమ్‌ని 'రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ (ఆర్‌ఎల్‌ఎస్)' అని అంటారు. అయితే, ఎక్కువ మంది ఇదేమీ హాని చేయదనే భావిస్తుంటారు. నిజానికిది తీవ్రమైన ఇబ్బందేమీ కాదు కూడా. కానీ మన నిద్రను ఎంతో ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి వేళల్లోనే దీని లక్షణాలు తీవ్రంగా కనిపిస్తుంటాయి. అయితే ఈ సమస్యను తగ్గించుకోవడానికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఆలస్యంగా నిద్రించటం
నైట్ కాస్త ఆలస్యంగా నిద్రపోయి.. పొద్దున కాస్త లేట్‌గా లేవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తెల్లవారు జామున పట్టే గాఢమైన నిద్ర మన శరీరానికి ఉదయాన్నే హుషారు, హాయి భావనను కలిగిస్తుంది.
వేళకు పడుకోవటం
డైలీ ఒకే సమయానికి పడుకోవటం, లేవటం అలవాటు చేసుకుంటే కొంతవరకు కాళ్లను కదిలించటాన్ని నివారించుకోవచ్చు. ఎంత సమయం నిద్రపోతే హాయిగా ఉంటుందనేది ఎవరికి వారే తెలుసుకొని, ఆ పద్ధతిని ఫాలో అయిపోవాలి. ఎక్కువ మందికి రోజుకు 7-9 గంటల నిద్ర అవసరమవుతుంది.
సాగదీత వ్యాయామాలు
నైట్ పడుకోవటానికి ముందు కాలి కండరాలను నెమ్మదిగా సాగదీసేందుకు ట్రై చేయాలి. ఇందుకు పిక్క సాగదీత వ్యాయామం చాలా బాగా యూజ్ అవుతుంది. ముందుగా తిన్నగా నిల్చొని, ఒక కాలును ముందుకు జరపాలి. వెనక కాలు, వీపును తిన్నగా ఉంచుతూ ముందు కాలు మీద బరువు వేసి కొద్దిగా వంగాలి. కొద్దిసేపు అలాగే ఉండి.. రెండో కాలుతోనూ ఇలాగే ట్రై చేయాలి. దీంతో పిక్క కండరాలు సాగి కొంత అసౌకర్యం తగ్గుతుంది. ఇలాంటి కాలి కండరాలను సాగదీసే యోగాసనాలూ రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ తగ్గించడానికి ఉపయోగపడతాయి.
మర్దన
రాత్రి పడుకునే ముందు పిక్క కండరాలను నెమ్మదిగా మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కాళ్లకు హాయి కలిగి నిద్ర బాగా పడుతుంది.
కెఫీన్ తగ్గించాలి
మనం రోజూ తాగే కాఫీ, టీ, కోలా, చాక్లెట్ వంటి వాటిల్లో కెఫీన్ ఉంటుంది. ఈ డ్రింక్స్ తక్షణ ఉత్సాహం ఇస్తుండొచ్చు.. కానీ కాళ్లలో అసౌకర్యాన్ని ఎక్కువ చేస్తాయి. కెఫీన్‌ను తీసుకున్న అనంతరం 12 గంటల వరకూ దీని ప్రభావం ఉండొచ్చు. కాబట్టి కాఫీ వంటి వాటికి దూరంగా ఉండాలి. దీంతో త్వరగా మంచి నిద్ర పట్టే అవకాశముంటుంది. అలాగే పొగ, మద్యం అలవాట్లకూ దూరంగా ఉండాలి. ఇవి ప్రాబ్లమ్‌ను ఎక్కువ చేయటమే కాదు.. నిద్ర పట్టకుండానూ చేస్తాయి. ఆల్కాహాల్, సిగరెట్లలోని నికొటిన్, కెఫీన్ ఉండే డ్రింక్స్ రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్‌ని మరింత తీవ్రం చేస్తాయని National Institutes of Health (NIH) నిపుణుల బృందం వెల్లడించింది. కాబట్టి, వీటిని వీలైనంత వరకు తీసుకోకపోవడం మంచిదని అంటున్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి).
వేడి కాపు
కాలి కండరాల్లో ఉష్ణోగ్రత మార్పులతో మంచి ఉపశమనం లభిస్తుంది. కొంతమందికి వేడి కాపు హాయిగా అనిపించొచ్చు. మరికొందరికి ఐస్ ప్యాక్‌తో ఉపశమనం కలగొచ్చు. ఏది పనిచేస్తే దాన్ని ఉపయోగించాలి. కొందరికి చన్నీటి స్నానంతో కూడా హాయిగా అనిపించవచ్చు.
మరికొన్ని
- నైట్ నిద్ర పోవటానికి ముందు గోరు వెచ్చటి నీటితో స్నానం చేయటం మంచిది. ఈ చిట్కా ఆర్‌ఎల్‌ఎస్ లక్షణాలు తగ్గటానికీ తోడ్పడుతుంది.
- ఐరన్ లోపం వల్ల కూడా కాళ్లలో అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి, వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్ష చేసుకోవాలి.
- రోజూ చెమట వచ్చేలా కొద్దిసేపు వ్యాయామం చేయడం వల్ల ఈ లక్షణాలు కొంత వరకు తగ్గుతాయి.
- తీవ్రమైన మానసిక ఒత్తిడితో అసౌకర్యం ఎక్కువవుతుంది. ఈ క్రమంలో నెమ్మదిగా, గాఢంగా శ్వాస తీసుకోవటం, వదలటం ద్వారా మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. ఒత్తిడి కూడా తగ్గుతుంది.
- పడుకోవటానికి ముందు మసక వెలుతురులో మంచి సంగీతం వినటం ద్వారా చక్కగా నిద్ర పడుతుంది.
- ఒకేచోట కదలకుండా కూర్చుంటే కాళ్లను కదపాలనే కోరిక ఎక్కువవుతుంది. ముఖ్యంగా ఈవెనింగ్ టైమ్‌లో టీవీ చూస్తున్నప్పుడో, బస్సులో కూర్చున్నప్పుడో కొందరికి దీని లక్షణాలు పెరుగుతుంటాయి.
- కాబట్టి వీటి నుంచి ధ్యాసను మళ్లించే కొన్ని చిట్కాలు ట్రై చేయాలి. ఈ క్రమంలో పజిళ్లు పూరించటం, పుస్తకం చదవటం, వీడియో గేమ్ ఆడటం వంటివి లక్షణాలు తగ్గటానికి తోడ్పడొచ్చని నిపుణులు చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
వైట్‌రైస్‌తో షుగర్ మాత్రమే కాదు "బెరిబెరి" కూడా - ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు!
డాక్టర్ గారూ 30 ఏళ్ల వయసులో - పూర్తి శాకాహారిగా మారితే ఏమవుతుంది?