TDP Leaders Criticize YCP Due To Protest On Farmers issues : రైతులను దగా చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం నేడు వారికి మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేయటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని టీడీపీ నేతలు విమర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ వైఎస్సార్సీపీ నేతలకు ఐదు ప్రశ్నలను సంధించారు. వైఎస్సార్సీపీ హయాంలో కౌలు రైతుల చట్టంలో మార్పులు చేసి వారికి తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు.
ఉపాధి హామీ పథకం కింద పనిచేసిన కూలీల నగదు సైతం దోచుకున్నారని మండిపడ్డారు. మిర్చి, పత్తి రైతులకు కనీసం గిట్టుబాటు ధర కల్పించలేక పోయారని విమర్శించారు. గత 5 ఏళ్లలో పాడి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. కో ఆపరేటివ్ బ్యాంకుల్లో గత పాలకుల అనుచరులు తప్పుడు పేర్లతో రుణాలు తీసుకున్నారని దుయ్యబట్టారు.
ఎంపీ అవినాష్‌రెడ్డి హౌస్ అరెస్ట్ - వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత
అయితే రైతుల సమస్యలు ఎదుర్కొంటున్నారంటూ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ పోరుబాట పట్టింది. అన్నదాతలకు పెట్టుబడి సాయం, బీమా ఇవ్వాలంటూ కలెక్టరేట్ల ఎదుట నిరసనలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని ప్రశ్నిస్తే కక్ష సాధింపులకు పాల్పడుతుందని మాజీ మంత్రి కన్నబాబు ఆరోపించారు. రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ కాకినాడలో వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి కన్నబాబు ఆందోళన చేశారు.
నెల్లూరులో మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. రైతులకు 20 వేల రూపాయలు పెట్టుబడి సహాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అయిందని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని విశాఖలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. శ్రీకాకుళంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
"సంస్కారహీనంగా మాట్లాడారు" - అంబటి, కొడాలి నాని, రోజాపై ఫిర్యాదు
కృష్ణా జిల్లా కలెక్టరేట్ వద్ద చేసిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్, కైలే అనిల్ కుమార్ పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని నేతలు మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కు వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్ సహా నాయకులు బయలుదేరి వెళ్లారు. కలెక్టరేట్ సమీపంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వర్ణాంధ్ర విజన్ -2047 ఆవిష్కరణ సభ నేపథ్యంలో అటువైపు వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినా వైసీపీ నేతలు ర్యాలీగా వెళ్లడంతో పోలీసులు అరెస్టు చేశారు. రైతుల సమస్యలపై అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ కు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ద్వారకనాథ్ రెడ్డిలు వినతి పత్రం అందజేశారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి, కర్నూలులో వైఎస్సార్సీపీ నాయకులు ర్యాలీ చేశారు.
వారి కోసం మూడు కుర్చీలు - కాకినాడ సెజ్‌పై చర్చకు రాని వైఎస్సార్సీపీ నేతలు