ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

ఖరారు కాని టీడీపీ, జనసేన రెండో జాబితా - ఉత్కంఠలో ఆశావహులు - JanaSena Candidates List

TDP- JanaSena Candidates Second List: తెలుగుదేశం- జనసేన ఉమ్మడిగా ప్రకటించిన తొలిజాబితాలో చాలా జిల్లాల్లో మెజార్టీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు కాగా, మిగిలిన వాటిల్లో గెలుపు గుర్రాలపై చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేశారు. జనసేన పోటీచేసే 19స్థానాలు ఎక్కడెక్కడ అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఏఏ స్థానాలు పొత్తులో పోతాయనే సస్పెన్స్ మలిజాబితా ఆశావహుల్లో కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలోనే ఈ సంఖ్య ఎక్కువగా ఉంది.

tdp_janasena_second_list
tdp_janasena_second_list

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 3, 2024, 9:38 AM IST

ఖరారు కాని టీడీపీ, జనసేన రెండో జాబితా - ఉత్కంఠలో ఆశావహులు

TDP - JanaSena Candidates Second List:తెలుగుదేశం-జనసేన మలి జాబితాపై ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. తొలి జాబితో జనసేన పార్టీ ఐదుగురు అభ్యర్థుల్ని ప్రకటించగా, మరో 19 మందిని ప్రకటించాల్సి ఉంది. ఇందులో రాజోలు స్థానానికి అభ్యర్థిని ప్రకటించకపోయినా ఆ స్థానం నుంచి జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గతంలోనే ప్రకటించారు. మిగిలిన 18 స్థానాల్లో జనసేన ఎక్కడెక్కడ పోటీ చేస్తుందనే టెన్షన్ తెలుగుదేశం నేతల్లో ఉంది. ఉత్తరాంధ్ర, ఉమ్మడి ఉభయగోదావరి, కోస్తా జిల్లాల్లో జనసేన ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉన్నందున ఆయా స్థానాలు ఏంటనేది తెలుగుదేశం ఆశావహుల్లో ఆసక్తి నెలకొంది.

మలి జాబితాలో ప్రకటించాల్సిన స్థానాలు పరిశీలిస్తే, శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో శ్రీకాకుళం, పలాస, పాతపట్నం, నరసన్నపేటలో అభ్యర్థులు ఇంకా తేలలేదు. శ్రీకాకుళం అసెంబ్లీ స్థానానికి మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి, శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు గొండు శంకర్‌ల మధ్య పోటీ నెలకొంది. నరసన్నపేటలో బగ్గు రమణమూర్తి, బగ్గు లక్ష్మణరావు కుమారుల మధ్య పోటీ ఉన్నందున అభ్యర్థి ఎవరో తేలాల్సి ఉంది. పలాసలో గౌతు శిరీష ఇంఛార్జ్‌గా ఉన్నారు. పాతపట్నంలో కలమట వెంకట రమణ, మామిడి గోవిందరావుల మధ్య ఏకాభిప్రాయం కుదిర్చి ఒకర్ని అభ్యర్థిగా తేల్చాల్సి ఉంది.

"రాజధాని లేని రాష్ట్రాన్ని డ్రగ్స్‌కు రాజధాని చేశారు"

విజయనగరం పార్లమెంట్‌లో ఎచ్చెర్ల, చీపురుపల్లి ప్రకటించాల్సి ఉంది. ఎచ్చెర్లలో పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు, చీపురపల్లిలో ఆయన అన్న కుమారుడు కిమిడి నాగార్జున ఇంఛార్జులుగా ఉన్నారు. చీపురుపల్లిలో మంత్రి బొత్సపై పోటీకి సీనియర్ నేత గంటా శ్రీనివాసరావును నిలబెట్టే యోచనలో తెలుగుదేశం ఉంది. ఎచ్చెర్ల సీటు కోసం కలిశెట్టి అప్పలనాయుడు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అరకు పార్లమెంటు స్థానంలో నాలుగు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించగా, పాడేరు, పాలకొండ, రంపచోడవరం స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. పాలకొండ స్థానం జనసేన పొత్తుతో ముడిపడే అవకాశం ఉంది. రంపచోడవరంలో మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, చిన్నం బాబూ రమేష్, సీతంశెట్టి వెంకటేశ్వర్లు మధ్య పోటీ నెలకొంది.

పాడేరు స్థానానికి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఇంఛార్జ్‌గా ఉన్నారు. విశాఖ పార్లమెంట్ పరిధిలో భీమిలి, గాజువాక, ఎస్.కోట, విశాఖ ఉత్తరం, విశాఖ దక్షిణం స్థానాలను ప్రకటించాల్సి ఉంది. భీమిలీ నుంచి గంటా, టీడీపీ ఇంఛార్జ్ కోరాడ రాజబాబు జనసేన నుంచి పంచకర్ల రమేష్‌లో ఎవరన్నది తేలాల్సి ఉంది. గాజువాకకు పల్లా శ్రీనివాస్ ఇంఛార్జ్‌గా ఉండగా గతంలో పవన్ పోటీ చేసిన ఈ స్థానాన్ని జనసేన ఆశిస్తోంది. శృంగవరపుకోట స్థానానికి మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ప్రవాసాంధ్రుడు గొంప కృష్ణల మధ్య పోటీ నెలకొని ఉంది. విశాఖ ఉత్తరం పొత్తులో భాగంగా ఏ పార్టీకి పోతుందన్న చర్చ నడుస్తోంది. విశాఖ దక్షిణం స్థానానికి గండి బాబ్జి ఇంఛార్జ్‌గా ఉండగా, జనసేన ఈ స్థానం నుంచి పోటీని పరిశీలిస్తోంది.

సభా వేదికపై చంద్రబాబు, పవన్‌ - పార్టీ జెండాలు ఊపి శ్రేణుల్లో ఉత్సాహం

అనకాపల్లి పార్లమెంట్ స్థానంలో చోడవరం, ఎలమంచిలి, మాడుగుల, పెందుర్తి స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. చోడవరం స్థానానికి బత్తుల తాతయ్యబాబు ఇంఛార్జ్‌గా ఉండగా, మాజీ ఎమ్మెల్యే కేఎస్​ఎన్​ రాజు ఆ స్థానాన్ని ఆశిస్తున్నారు. యలమంచిలి స్థానం పొత్తుతో ముడిపడి ఉంది. మాడుగుల నుంచి పీవీజీ కుమార్, మాజీ ఎమ్మెల్యే రామానాయుడు మధ్య పోటీ ఉంది. పెందుర్తి స్థానంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇంఛార్జ్‌గా ఉండగా జనసేన నుంచి పంచకర్ల రమేష్ బాబు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల విషయానికొస్తే కాకినాడ పార్లమెంట్ పరిధిలో కాకినాడ, పిఠాపురం, పత్తిపాడు స్థానాలను ప్రకటించాల్సి ఉంది. పిఠాపురం, కాకినాడ అర్బన్, రూరల్ స్థానాలను జనసేన ఆశిస్తోంది. అమలాపురం పార్లమెంట్‌ పరిధిలో అమలాపురం, రంపచోడవరం, రాజోలు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. రాజోలులో జనసేన పోటీ చేస్తుందని పవన్‌ గతంలోనే ప్రకటించారు. అమలాపురం, రామచంద్రాపురం స్థానాల్నీ జనసేన ఆశిస్తోంది. రాజమండ్రి పార్లమెంట్‌లో రాజమండ్రి రూరల్, నిడదవోలు, కొవ్వూరు, గోపాలపురం స్థానాలను ప్రకటించాల్సి ఉంది. నిడదవోలు, రాజమండ్రి రూరల్ జనసేనతో ముడిపడి ఉంది. నర్సాపురం పార్లమెంట్ పరిధిలో భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెంలో అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉండగా ఈ మూడు స్థానాల్ని జనసేన ఆశిస్తోంది.

ఉత్కంఠ వీడేనా - ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ అభ్యర్థులు ఎవరు?

ఏలూరు పార్లమెంట్‌లో దెందులూరు, కైకలూరు, పోలవరం, ఉంగుటూరు స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉండగా దెందులూరుకు చింతమనేని ప్రభాకర్ ఇంఛార్జ్‌గా ఉన్నారు. పార్టీలో అంతర్గత వ్యవహారం కారణంగా ఇది పెండింగ్‌లో పడింది. కైకలూరు స్థానానికి కొడాలి వినోద్ తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. పోలవరం స్థానాన్ని జనసేన ఆశిస్తోంది. ఉంగుటూరు అసెంబ్లీ స్థానానికి మాజీ ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు ఇంఛార్జ్‌గా ఉన్నారు. ఈ స్థానం పొత్తులో భాగంగా జనసేన ఆశిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details