ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

ఇది అక్కాచెల్లెమ్మల తీర్పు - ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరులు కోరిన మార్పు! - ap elections 2024 - AP ELECTIONS 2024

Big Shock to YSRCP in AP Elections 2024 : కూల్చివేతలతో మొదలైన పాలన కాలగర్భంలో కలిసిపోయింది! ప్రతీకార పాలకుడి పాపం పండింది. బటన్లు నొక్కానంటూ బడాయిపోయిన బిడ్డకు ఓటర్లు ఎగ్జిట్‌ బటన్‌ నొక్కారు. 'వైనాట్ 175' అంటూ తలెగరేసిన జగనాసురుడి కొమ్ములు విరిచారు. సిద్ధం అంటూ విర్రవీగిన జగన్‌ రెక్కలు విరిచారు! విధ్వంసాలు, విద్వేషాలతో సాగించిన అరాచకాలకు ప్రజలు చరమగీతం పాడారు! నీకిచ్చిన ఒక్కఛాన్స్‌ అయిపోయింది వెళ్లవయ్యా వెళ్లూ అంటూ సాగనంపారు. ఇక ఒక్క నిమిషం కూడా అధికారంలో ఉండడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. గంగలో మునిగినా నిష్కృతికాని పాపాలు చేసిన జగన్‌కు పాలించే అర్హతే లేదని తీర్పు ఇచ్చారు.

Big Shock to YSRCP
Big Shock to YSRCP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 4, 2024, 1:48 PM IST

Updated : Jun 4, 2024, 5:40 PM IST

Big Shock to YSRCP in AP Elections 2024 : వరమిచ్చిన శివుడికే కీడు తలపెట్టి చివరికి తన తలపై తానే చేయిపెట్టుకుని భస్మమైపోయాడు భస్మాసురుడు! ఆంధ్ర రాష్ట్రంలో అవతరించిన కలియుగ భస్మాసురుడు జగన్‌కూ అదే గతి పట్టింది!! ఒక్కఛాన్స్ అని వేడుకుంటే అఖిలాంధ్రులు 151 సీట్లు ఇచ్చి 2109 ఎన్నికల్లో అనుగ్రహించారు. అంతటి అఖండ మెజార్టీ కట్టబెట్టిన జనాన్ని జగన్‌ రాచి రంపాన పెట్టారు. పన్నులతో పీల్చిపిప్పిచేశారు. ప్రతిపక్షంలో ఉండగా బాదుడే బాదుడు అంటూ రాగాలు తీసి కుర్చీ ఎక్కాక బండ బాదుడు బాదారు. ఆర్టీసీ ఛార్జీలు, కరెంటు బిల్లులు, పెట్రోల్‌ ధరలు, నిత్యావసర సరుకులు ఇలాఅన్ని విధాలుగా భారాలు మోపి ప్రజల ఆర్థిక స్థితిగతుల్ని చిన్నాభిన్నం చేశారు. అందుకే 2019లో నెత్తినపె‌ట్టుకున్న ఓటర్లే ఐదేళ్లు తిరిగేసరికి నేలకేసికొట్టారు.

YS Sharmila and Sunitha Against YS Jagan: 2019ఎన్నికల్లో జగన్‌కు కులమతాలకు అతీతంగా మద్దతిచ్చారు. కానీ, గద్దెనెక్కాక అపరిచితుడిని మించిన వేరియేషన్స్‌ చూపించారు. 2019కి ముందు పాదయాత్ర ద్వారా జనం తలలు నిమిరిన జగన్‌ పీఠం చేజిక్కగానే అనుభించు రాజా అంటూ అధికార చట్రంలో ఉండిపోయారు. మా గోడు విను జగనన్నా అని క్యాంప్ అఫీస్‌ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసినా తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి కనీసం బయటకు వచ్చి పలకరించలేనంతగా జగన్‌ గుండె బండబారింది. రోజంతా నిరీక్షించి, నీరసించినా ఒక్కరి నుంచీ వినతిపత్రం తీసుకున్న దాఖలాలే లేవు. ప్రతిపక్షాలనైతే ఆ దరిదాపుల్లోకే రానివ్వలేదు! సొంత పార్టీ MLAలైనా ఆయనకు బుద్ధిపుట్టి పిలిస్తే తప్ప నేతలు కలవాలనుకుంటే దర్శనమివ్వరు! అంతఃపురం నుంచి బయటకికెళ్తే పరదాల మధ్య తిరిగారు! జగన్‌కు జనంతో పనిలేనప్పుడు జనానికీ జగన్‌తో అవసరం ఏమంటుంది? అందుకే అధికారానికి దూరం పెట్టారు. గతంలో జగన్‌ వెంట నడిచిన ఎంతో మంది ఐదేళ్లు గడిచేసరికి ఆయనేంటో అర్థం చేసుకుని మీ విపరీత సంస్కారానికో నమస్కారం అంటూ దండం పెట్టేశారు. చివరకు జగన్‌ను సీఎం చేయాలంటూ కాలికిబలపం కట్టుకుని తిరిగి ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల కూడా ఆయన దుర్మార్గాన్ని సహించలేక దూరం జరిగారు.

ఇక జగన్‌ పరాభవానికి మరో కారణం ఆడిన మాట తప్పడం. మాట తప్పను, మడమ తిప్పనంటూ ఊదరగొట్టి అడుగడుగునా నాలుక మడతేశారు, మడమ అష్టవంకర్లు తిప్పేశారు. అందుకే ఓటర్లు తగిన శాస్తి చేశారు. మద్యపాన నిషేధం చేయకుండా నాసిరకం మద్యంతో పసుపుకుంకాలు చెరిపేసిన దుర్మార్గపు అన్నకు ఆడబిడ్డలు బుద్ధి చెప్పారు. అమరావతే రాజధాని అని నమ్మబలికి రాష్ట్ర భవిష్యత్‌తో మూడుముక్కలాట ఆడినందుకు శంకరగిరి మాన్యాలు పట్టించారు! ఐదేళ్లలో పాతికలక్షల ఇళ్లు కట్టిస్తానని చెప్పి నాలుగోవంతైనా పూర్తిచేయనందుకు వైఎస్సార్సీపీ కోటను కూలదోశారు! వారంలో సీపీఎస్‌ రద్దు చేయకపోగా రివర్స్‌ PRCతో వంచించినందుకు ఉద్యోగులు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. మా నాన్న కల, గిల అంటూ పోలవరం సహా జలయజ్ఞం ప్రాజెక్టులను రివర్స్‌ టెండరింగ్‌తో అస్తవ్యస్థం చేసినందుకు రైతులు కలుపు మొక్కలా తీసిపారేశారు. మెగా డీఎస్సీ, ఏటా జాబ్ క్యాలెండర్‌ అంటూ మోసగించిందుకు నిరుద్యోగులు దుడ్డుకర్రతో దండించారు. భారీ పెట్టుబడులు పెట్టే పరిశ్రమలను రాష్ట్రం నుంచి తన్ని తగలేసినందుకు యువకులు తరిమి కొట్టారు.

నిధులు, విధుల్లేని కార్పొరేషన్లతో సామాజిక అన్యాయం చేసినందుకు ఆయావర్గాల ప్రజలు అట్లకాడతో వాతలు పెట్టారు. రంజాన్‌ తోఫాను తీసేసినందుకు ముస్లింలు గుణపాఠం చెప్పారు. క్రైస్తవ యువతుల ‘పెళ్ళికానుక’కు సొమ్ములివ్వని సైతాన్‌ను సాగనంపారు. 5రూపాయలకే ఆకలి తీర్చిన అన్నక్యాంటీన్లు మూసేసి పేదల నోటికాడ ముద్దలాగేసి మహాపరాధం చేశారు.! తిరుమల, శ్రీశైలం వంటి పవిత్ర ఆలయాల్లో వైఎస్సార్సీపీ రాక్షసులు చేసిన పాడుపనుల్ని అరికట్టలేని అధర్మపాలకుడు జగన్‌ను హిందువులు ఓటుతో దండించారు.

జనానికి పప్పుబెల్లాలు పంచి తాను కొండల్ని మింగేసినా జనం కళ్లు మూసుకుంటారని జగన్‌ భ్రమించారు. అందుకే బటన్లు నొక్కుతున్నాని ఎంత దరువేసుకున్నా ఓటర్లు ఆయనకు ఎగ్జిట్ బటన్‌ నొక్కేశారు. జగన్‌ సంక్షేమమంతా మోసమే. నిజానికి ఆయన ఇచ్చినదాని కన్నా ఎగ్గొట్టిందే ఎక్కువ. రైతులకు ఏటా 12న్నర వేలు ఇస్తామంటూ పీఎం కిసాన్‌ కింద కేంద్రం ఇచ్చే 6వేల రూపాయలనూ కలిపేసుకుని అన్నంపెట్టే అన్నదాతలను మోసగించారు. ఇంట్లో ఇద్దరు పిల్లలున్నా అమ్మఒడి ఇస్తామని చెప్పి.. ఒక్కరికే పరిమితం చేశారు. వైద్య ఖర్చు వెయ్యిదాటితే ఆరోగ్యశ్రీ పరిధిలో ఉచితమేనని ప్రచారం చేసుకుని ఒక్కసారికీ ఆ ప్రయోజనం కల్పించలేదు! సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు సిద్ధమయ్యే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు గత ప్రభుత్వం అమలు చేసిన ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని రద్దు చేశారు. పోటీ పరీక్షలకు శిక్షణనిచ్చే అంబేడ్కర్‌ స్టడీ సర్కిళ్లను నామమాత్రంగా మార్చేశారు. గిరిజన, దళిత పిల్లల్ని ఉన్నత విద్యాభ్యాసానికి విదేశాలకు పంపేందుకు గత ప్రభుత్వం అమలు చేసిన అంబేడ్కర్‌ విదేశీ విద్యా పథకం పేరు మార్చేసి తన పేరు పెట్టుకున్నారు. మూడేళ్లపాటు ఆ పథకాన్ని పక్కన పెట్టేసి ఆ తర్వాత ఎక్కడలేని నిబంధనలతో అర్హుల సంఖ్యను కుదించేశారు. ఎస్సీల కోసం దశాబ్దాలుగా వివిధ ప్రభుత్వాలు అమలు చేసిన భూమి కొనుగోలు పథకాన్ని ఎత్తేశారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల్ని దారి మళ్లించారు. అగ్రిగోల్డ్ బాధితుల డబ్బు పువ్వుల్లో పెట్టి ఇస్తామంటూ చెవిలో కాలీఫ్లవర్లు పెట్టారు. ఆటో, టాక్సీ డ్రైవర్లుకు ఏటా 10 వేలు ఇస్తున్నట్లే ఇచ్చి చలాన్లు బాదేశారు. కనీసం రోడ్లు సరిగా లేకపోవడంతో అవి రీపేర్లకే చాలలేదు. అమలు చేసిన పథకాల్లోనూ కుంటిసాకులతో కొర్రీలువేసిన జగన్‌ రివర్స్‌లో సంక్షేమ సామ్రాట్‌లా ఫోజులిచ్చారు. కానీ కుడిచేత్తో ఇచ్చి ఎడమ చేత్తో గుంజుకున్న జగన్‌ మోసకారి సంక్షేమానికి ఓటర్లు ముగింపు పలికారు. లక్షల కోట్ల అప్పులు జనం నెత్తిన రుద్దిన ఆర్థిక ఉగ్రవాదిగా జగన్‌ను ఛీకొట్టారు.

పాలనలో ప్రజలపై మమకారం, బాధితులపై కనికరం చూపాల్సిన జగన్ ఫ్యాక్షనిజం చూపించారు. ఓ ఫాసిస్టులా మారి ప్రశ్నించినవారి ప్రాణాలుతీశారు. మాట్లాడితే దాడి, ప్రశ్నిస్తే అరెస్ట్‌, నిరసన చేస్తామంటే నిర్బంధం ఇలా ఒకటేంటి గూండాలు, పోలీసులను చంకనేసుకుని పౌరహక్కులను కబళించారు. మాచర్ల వంటి ప్రాంతాల్లో నడిరోడ్డుపై తెలుగుదేశం నాయకుల కుత్తుకలు కోయించారు. పార్టీ కార్యాలయాలు తగబెట్టించారు! తెలుగుదేశం ప్రధాన కార్యాలయం, అధినేత చంద్రబాబు ఇంటిపైకి ఏకంగా పార్టీ నాయకులే రౌడీలను వెంటేసుకుకెళ్లి దాడులు చేసేంత అపరిమిత స్వేచ్ఛ ఇచ్చిన రౌడీ పాలకుడు జగన్‌! అసెంబ్లీ అనే ఇంగితం కూడా లేకుండా కుటుంబ సభ్యులపట్ల అమానుషంగా మాట్లాడించి చంద్రబాబును ఏడిపించిన పైశాచికానందం జగన్‌ది.

సకల శాఖామంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డి విపక్షాలపైకి అన్ని వ్యవస్థలనూ ఉసిగొల్పగా, వాటిని ప్రశ్నించిన ప్రజాస్వామ్యవాదుల్ని ఆయన తనయుడు భార్గవ్‌రెడ్డి సోషల్‌ మీడియా విభాగంతో దుమ్మెత్తి పోయించారు. న్యాయస్థానాలు, న్యాయమూర్తులనూ దూషించారు. ఈ వికృత క్రీడలో జగన్‌ సొంత కుటుంబ సభ్యుల్నీ వదల్లేదు. వివేకా హత్యకేసులో న్యాయం కోసం పోరాడుతున్న సునీత, ఆమెకు మద్దతుగా నిలిచిన షర్మిలను వినలేని, రాయలేని అసభ్యపదజాలంతో తిట్టిపోయించారు. చివరకు జగన్ కూడా ఉచ్ఛనీచాలు మరిచి షర్మిల కట్టుకునే చీర గురించి మాట్లాడే స్థాయికి దిగజారారు. ఇలాంటి ఆటవిక పాలనను భరించలేని ఓటర్లు ఆయన్ను కారడవులకు పంపారు.

జగన్‌ పాలనంటనే వేల కోట్ల రూపాయల ఇసుక, మట్టి, ఖనిజాలను మింగేసిన మాఫియా సామ్రాజ్యం. చెప్పింది వినాలి, చేసింది చూస్తూ ఉరుకోవాలి! ఇదేం అన్యాయమని ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేనంత... ఫాసిస్టులా మారారు జగన్‌! అందుకే ఉచిత ఇసుకను దూరం చేసిన ఇసుకాసురుల్ని జనం రేవుల్లో పడేసి తొక్కేశారు. సర్కారీ స్థలాలు, జనం జాగాలను దిగమింగిన భూబకాసురుల కోరలను జనం పీకేశారు. జగన్‌ అధికారంలో ఉంటే జన మానప్రాణాలేకాదు, ఆస్తులకూ రక్షణ లేదనేంత అభద్రతాభావానికి లోనయ్యారు. మొదట్నుంచీ రంగులు పిచ్చిలో మునిగితేలిన జగన్‌ చివరకు పట్టాదారుపాసు పుస్తకాలు, పొలం సరిహద్దుల్లో తన బొమ్మ వేయించడం రైతుల్లో భయోత్పాతం సృష్టించింది. భూ కబ్జాలను చట్టబద్ధం చేసేలా జగన్‌ సర్కార్‌ తెచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్‌ను జనం ల్యాండ్‌మైన్‌లా భావించారు. తాతముత్తాతల నుంచీ వస్తున్న మా భూములూ మాకు మిగల్చరేమో అనే ఆందోళన చెందారు. జీవితంలో మళ్లీ ఇలాంటి దారుణ పాలన వద్దంటూ జగన్‌ ఆటవిక రాజ్యాన్ని భూస్థాపితం చేశారు.

వైఎస్సార్సీపీ పిశాచగణాలు పేదల భూముల్ని చెరబడుతుంటే కళ్లప్పగించి చూసిన జగన్‌ను ఓటర్లు ఓ బకాసురుడిలా భావించారు. మహిళలపై పార్టీ నాయకుల అఘాయిత్యాలు, అసభ్య ప్రవర్తనలను అడ్డుకోకుండా వెనకేసుకొచ్చిన సందర్భాల్లో జగన్‌ను మారీచుడిలా చూశారు. ప్రభుత్వ దమననీతిని ప్రశ్నించిన వాళ్లపై దాడులు చేయించడం, అక్రమ కేసులు పెట్టించడం చూసి చరిత్రలో ఉన్నరాక్షసులందరూ కలగలిసిన నరరూప రాక్షసుడిలా జగన్‌ను ఊహించుకున్నారు. వివేకా హత్య కేసులో అందరివేళ్లూ చూపిస్తున్న అవినాష్‌రెడ్డిని జగన్‌ వెనకేసుకొచ్చి జగన్‌ నేరస్తుల ప్రతినిధిగా మిగిలిపోయారు.

ఏపీలో కూటమి సునామీ - 150కు పైగా స్థానాల్లో దూసుకుపోతున్న అభ్యర్థులు - AP Election Result

తప్పులు చేయడం మానవ నైజం. కాకపోతే వాటిని సరిదిద్దుకోకుండా.. శిశుపాలుడిలా తప్పులు మీద తప్పులు చేసుకుంటూ వెళ్లిన జగన్‌ జనం చేతిలో చావుదెబ్బతిన్నారు. నిజానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పే అఖరి ప్రమాద హెచ్చరిక. పట్టభద్రుల MLC ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్రలో 18.89శాతం, తూర్పు రాయలసీమలో 19.10శాతం, పశ్చిమ రాయలసీమలో 13.37శాతంమేర ఓట్లు కోల్పోయింది. 3 MLC స్థానాల్నీ తెలుగుదేశం కైవసం చేసుకుంది. ఐతే.. ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన వైఎస్సార్సీపీ పెద్దలు పట్టభద్రులు తమ ఓటర్లు కాదంటూ తింగరితనాన్ని ప్రదర్శించారు! వైనాట్‌ 175, వైనాట్‌ కుప్పం, వైనాట్‌ పిఠాపురం అంటూ చిటికెల పందిళ్లు వేశారు. వారి వేళ్లను జనం విరిచేశారు. విధ్వంసం, విద్వేషం, వంచనలతో రాష్ట్రాన్ని దుంపనాశనం చేసి ఐదేళ్లలోనే 50 ఏళ్ల విధ్వంసం సృష్టించిన జగన్‌ తన ఓటమి ఖరారైందని తెలుసుకున్నాక రూటు మార్చారు. కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని. దుష్ప్రచారానికి దిగారు. కానీ అదీ బెడిసి కొట్టింది..! ప్రభుత్వాలు మారినప్పుడల్లా సంక్షేమ పథకాలు మరింతగా మెరుగవుతాయే తప్ప తీసేయరనే భావన జనంలో బలపడింది. 2019లో వెయ్యిరూపాయల పింఛన్‌ను ఒకేసారి రెండువేలకు పెంచిన చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే 4వేల రూపాయలు చేస్తామని ఇచ్చిన హామీపై ప్రజలకు నమ్మకం కుదిరింది. మా నమ్మకం నువ్వే అని జగన్‌ ఇంటింటికీ స్టిక్కర్లు వేయించినా నీ మాయమాటలు నమ్మం జగన్‌ అంటూ ప్రజలు కసిగా ఓడించారు.

తాడేపల్లి తాబేదార్లు రాసిస్తే తప్ప సొంతగా ఒక్క ముుక్కా మాట్లాడలేని ఒక తోలుబొమ్మ జగన్‌! చివరకు తెలుగువారి ఠీవీ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న ప్రకటిస్తే కనీసం సంతోషం వ్యక్తం చేస్తున్నా అనే మాట కూడా చెప్పలేకపోయారు. వెనుక వస్తున్న సాయిరెడ్డి స్పందిస్తారంటూ జాతీయ మీడియా ముందు తన గాలి తానే తీసేసుకుని రాష్ట్రం పరువు కూడా తీసేసిన పాలకుడు జగన్! జగన్‌ పాలనే రాష్ట్రానికి ఓ పీడకల. ఐదేళ్లూ వైఎస్సార్సీపీ అరాచకమూక తప్ప ఏ వర్గమూ సంతోషంగా ఉన్నది లేదు. ఏ వ్యవస్థా స్వేచ్ఛగా పనిచేసింది లేదు! ప్రజాస్వామ్య స్ఫూర్తిని పాతాళానికి తొక్కేసి, వ్యవస్థలన్నిటినీ కూలదోసి, బానిస యుగాన్ని తలపించేలా సాగిన సీఎం జగన్‌ పాలన రాష్ట్రాన్ని గాడాంధకారంలోకి నెట్టేసింది. ఐదేళ్లలో తన పాపాల్ని లెక్కించడం చిత్రగుప్తుడి వల్లకూడా కాదనుకుని జగన్ విర్రవీగితే జనం ప్రతీఒక్కటీ గుర్తుంచుకున్నారు! ఆయన అరాచాకలకు అంతం పలుకుతూ విస్పష్ట తీర్పు ఇచ్చారు.

జిల్లాలకు జిల్లాలే క్లీన్ స్వీప్‌ - భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోన్న కూటమి - Hello AP Bye Bye YCP

Last Updated : Jun 4, 2024, 5:40 PM IST

ABOUT THE AUTHOR

...view details