CM Chandrababu Naidu To Visit Davos For Four Days To Bring investments : రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి నుంచి నాలుగు రోజుల పాటు దావోస్‌లో పర్యటించనున్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్‌తో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధించే దిశగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు తొలి విదేశీ పర్యటన సాగనుంది. ఈ సాయంత్రం దిల్లీ వెళ్లనున్న సీఎం అక్కడి నుంచి అర్థరాత్రి జ్యూరిచ్‌కు బయలుదేరివెళ్తారు.
ప్రపంచ వ్యాపార దిగ్గజాలు వచ్చే ఆర్థిక సదస్సులో భాగస్వాములై, రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనకు వెళ్తున్నారు. సీఎం చంద్రబాబు బృందంలో ఐటీశాఖ మంత్రి లోకేశ్, పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్‌తో పాటు అధికారులు ఉన్నారు. దిల్లీ నుంచి అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో తన బృందంతో జ్యూరిచ్ చేరుకుంటారు. ముందుగా జ్యూరిచ్‌లో భారత రాయబారితో భేటీ అవుతారు.
మైండ్‌ను కంట్రోల్లో పెట్టాలి - 'స్వచ్ఛ ఆంధ్ర'కై పని చేయాలి: సీఎం చంద్రబాబు
అనంతరం హిల్టన్ హోటల్‌లో పారిశ్రామిక వేత్తలతో సమావేశం అవుతారు. తర్వాత హోటల్ హయత్‌లో తెలుగు పారిశ్రామిక వేత్తలతో సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా పేరుతో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులపై వారితో చర్చిస్తారు. ఏపీని ప్రమోట్ చేయడం, పెట్టుబడులకు వారిని ఆహ్వానించడంపై సమావేశంలో చర్చిస్తారు. అక్కడ నుంచి 4 గంటల పాటు రోడ్డు మార్గంలో ప్రయాణించి దావోస్ చేరుకుంటారు.
దావోస్ పర్యటన తొలిరోజు రాత్రి పలువురు పారిశ్రామిక వేత్తలతో డిన్నర్ మీటింగ్‌లో చంద్రబాబు పాల్గొంటారు. తర్వాత అర్సెల్లార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీమిట్టల్‌తో సమావేశమవుతారు. రెండోరోజు CII సెషన్‌లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై చర్చలో పాల్గొంటారు. ఆ తర్వాత సోలార్ ఇంపల్స్, కోకకోలా, వెల్ స్పన్, LG, కార్ల్స్ బర్గ్, సిస్కో, వాల్ మార్ట్ ఇంటర్ నేషనల్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ వంటి సంస్థల ఛైర్మన్‌లు, CEOలతో ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. యుఏఈ ఆర్ధికమంత్రి అబ్దుల్లా బిన్‌తో సీఎం భేటీ ఉంటుంది. ఆ తర్వాత ఎనర్జీ ట్రాన్సిషన్‌పై వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వహించే చర్చలో సీఎం పాల్గొంటారు.
అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లోని ఇళ్ల రెగ్యులరైజేషన్‌కు కేబినెట్ ఓకే- అయితే?
అనంతరం ది నెక్ట్స్ వేవ్ పైనీరింగ్ ది బ్లూ ఎకానమీ ఆఫ్ టుమోరో అనే చర్చా కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతారు. రెండో రోజు ఈ భేటీలతో పాటు వివిధ జాతీయ అంతర్జాతీయ మీడియా సంస్థలు నిర్వహించే చర్చా కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. బ్లూమ్ బర్గ్ వంటి మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా ఏపీ పాలసీల గురించి వివరిస్తారు. మూడో రోజు కూడా బిజనెస్ టైకూన్‌లతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. రోజుకు కనీసం పదికిపైగా భేటీలు, సమావేశాల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. నాలుగో రోజు దావోస్ నుంచి జ్యూరిచ్‌కు చేరుకుని అక్కడి నుంచి స్వదేశానికి రానున్నారు.
నాలుగు రోజుల దావోస్ పర్యటనలో బ్రాండ్ ఏపీ ప్రమోషన్‌తో పెద్దఎత్తున పెట్టుబడులకు మార్గం సుగమం చేసేందుకు సీఎం ఆలోచనలు చేస్తున్నారు. దెబ్బతిన్న బ్రాండ్ పునరుద్దరణతో మళ్లీ రాష్ట్రానికి దేశ, విదేశీ పెట్టుబడులు తెచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. దీనికి ఈ పర్యటన దోహదం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
'ఫొటోలకు ఫోజులు కాదు - ఫలితాలు కావాలి' - మంత్రులు, ఎంపీలకు చంద్రబాబు క్లాస్