YSRCP Target Pawan Kalyan : వైఎస్సార్సీపీలో గ్రూపు రాజకీయాలు వేడెక్కాయి. కార్యకర్తలు, నియోజకవర్గ నాయకుల అభిప్రాయాలను ఏ మాత్రం లెక్కచేయని అధిష్ఠానం ఇష్టారాజ్యంగా బదిలీలు చేపట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎదురవుతున్న అసంతృప్తిని చల్లార్చేందుకు తాడేపల్లి వేదికగా చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గాల వారీగా రెబల్ అభ్యర్థులను పిలిపించి బుజ్జగిస్తున్నారు. 'అధికారంలోకి వస్తే' అంటూ పదవులు ఆశ చూపిస్తున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తాను పోటీ చేయనున్నట్లు ప్రకటించిన పిఠాపురం సీటుపై వైసీపీ అధిష్ఠానం సీరియస్‌గా దృష్టి సారించింది. ఇప్పటికే తాయిలాల పంపిణీ కొనసాగుతుండగా మాజీలను ఓదార్చే పనిలో నిమగ్నమైంది. జనసేన నేత మాకినీడి శేషుకుమారి (Makinidi Seshu Kumari) ని పార్టీలో చేర్చుకున్న జగన్ తాజాగా సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబును పిలిపించుకుని మాట్లాడారు. మళ్లీ అధికారంలోకి వస్తే పదవి ఇస్తామని చెప్తూ పార్టీ విజయానికి పాటు పడాలని కోరారు.
పిఠాపురం నుంచి బరిలో పవన్‌కల్యాణ్ - స్వయంగా వెల్లడించిన జనసేనాని
పిఠాపురం నుంచి అసెంబ్లీ కి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్న సీఎం జగన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం (Kapu community leader Mudragada) సహా పలువురు వైఎస్సార్సీపీ ముఖ్య నేతలను పిఠాపురం ఇన్‌చార్జీగా నియమించిన జగన్ నిన్న పిఠాపురం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన జనసేన నేత మాకినీడి శేషుకుమారిని పార్టీలో చేర్చుకున్నారు. కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబును పిలిచి బుజ్జగించారు. ఈ సారి పెండెం దొరబాబుకు పిఠాపురం టికెట్ ఇవ్వని సీఎం వైఎస్ జగన్ దొరబాబు స్థానంలో వంగా గీతను బరిలో నిలిపారు.