Ministers Inspected Arrangement of Telangana Formation Celebrations :రాష్ట్రం కోసం ఎన్నో వర్గాల ప్రజలు పోరాటం చేశారని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల ఏర్పాట్లను మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు పరిశీలించి మాట్లాడారు. తెలంగాణ వచ్చాక పదేళ్లపాటు నియంతృత్వం కొనసాగిందని విమర్శించారు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, అందరూ ఉత్సాహంగా వేడుకలు జరుపుకోవాలని కోరారు.
అమర వీరులను స్మరించుకుంటూ ఆవిర్భావ వేడుకలు జరుగుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆనాడు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఒక్క అడుగు వెనక్కి వేసినా, రాష్ట్ర ఏర్పాటు సాధ్యమయ్యేది కాదన్నారు. ప్రధాని మోదీ తెలంగాణ ఏర్పాటును అవమానించేలా ఎన్నోసార్లు మాట్లాడారని దుయ్యబట్టారు. భవిష్యత్‌లో తెలంగాణ, ప్రజాస్వామిక రాష్ట్రంగా మరింత ముందుకెళ్తుందని ఆశించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర అవతరణ వేడుకలకు రాజకీయాలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
"ప్రజల పాలనలో జరుగుతున్న ఈ దశాబ్ది వేడుకల్లో ప్రజలంతా పాల్గొనాలి. నాడు తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన గీతాన్ని, నేడు రాష్ట్ర గేయంగా రేపు ఆవిష్కరించకోవటం జరుగుతుంది. ఈ వేడుకలను అన్ని రాజకీయ పార్టీలు ఘనంగా జరుపుకోవాలి. అందరూ భాగస్వాములు కావాలి. గత పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో మాకెవరికీ ఆహ్వానం రాలేదు. మేము తెలంగాణ బిడ్డలమే. ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సైతం మర్యాదపూర్వకంగా ఆహ్వానం పంపించాం."-పొన్నం ప్రభాకర్, మంత్రి