Telangana Lok Sabha Elections 2024 : హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం 1951లో ఏర్పడింది. మొదటి నుంచీ ఇది జనరల్ కేటగిరిలోనే ఉంది. ఈ లోక్‌సభ స్థానం పరిధిలో మలక్‌పేట్, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకత్పురా, బహదూర్‌పురా అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో రెండే పార్టీలు విజయం సాధించాయి. ఏడుసార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా, 1984 నుంచి 10 సార్లు ఎంఐఎం గెలుపొందుతూ వస్తోంది. గత 4 లోక్‌సభ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థిగా పోటీలో నిలిచి, ఘన విజయాన్ని అందుకున్నారు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ. తాజాగా ఐదోసారీ ఆయనే బరిలో నిలబడ్డారు.
కాంగ్రెస్ పార్టీ తర్వాత హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం వరుస విజయాలతో మజ్లిస్ పార్టీకి కంచుకోటగా మారింది. 1984 పార్లమెంట్ ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఎంఐఎం అభ్యర్థి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ విజయం సాధించగా, నాటి నుంచి 1984, 1989, 1991, 1996, 1998, 1999 సంవత్సరాల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 6సార్లు ఆయనే తిరుగులేని విజయం సాధించారు. ఆయన అనంతరం తన పెద్ద కుమారుడైన అసదుద్దీన్ ఒవైసీ 2004 పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి బరిలోకి దిగి, లక్ష ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. అనంతరం 2009, 2014, 2019ల్లోనూ విజయ ఢంకా మోగించి హైదరాబాద్‌ను మజ్లిస్‌కు కంచుకోటగా చేసుకున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు అభ్యర్థులను బరిలో నిలిచినా, పోటీ మాత్రం మజ్లిస్, బీజేపీ మధ్యే నెలకొంది. ఆ 2 పార్టీల వ్యూహ, ప్రతివ్యూహాలతో ఇక్కడి రాజకీయాలు వేడెక్కాయి. అసదుద్దీన్ ఒవైసీకి ఈసారి ప్రత్యర్థి మాధవీ లత నుంచి బలమైన పోటీ తప్పదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దీనికి కారణమూ లేకపోలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లి, యాకుత్‌పురా నియోజకవర్గాల్లో ఎంఐఎం గట్టి పోటీని ఎదుర్కొంది. నాంపల్లిలోనూ కాంగ్రెస్‌తో హోరాహోరీ తప్పలేదు. దీంతో ఎంపీ ఎన్నికల్లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురు కావొచ్చని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది.
హైదరాబాద్‌లో మజ్లిస్ ఏకఛత్రాధిపత్యం
అయితే ఎంపీ ఎన్నికల్లో ప్రత్యర్థులకు అందకుండా తన సత్తా చాటేందుకు అసదుద్దీన్ కొత్త వ్యూహాలకు పదునుపెట్టారు. ఇందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని మొదలెట్టారు. హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో వరుసగా అభివృద్ధి పనులు ప్రారంభించారు. అదే సమయంలో మోదీ సర్కార్ మజ్లిస్ సమాజ అభివృద్ధికి కృషి చేయకపోగా, అణచివేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తూ వస్తున్నారు. కేవలం హిందువులకే మోదీ ప్రధానిలా వ్యవహరిస్తున్నారంటూ మజ్లిస్ సమాజం బీజేపీవైపు చూడకుండా అసదుద్దీన్ తీవ్రంగా శ్రమిస్తున్నారు.