CM Jagan Reddy is Woman Traitor : సొంత చెల్లెళ్లకే జవాబు చెప్పలేని జగన్ ప్రజలకు ఏం సమాధానం చెబుతారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు నిలదీశారు. విజయమ్మ, షర్మిల, సునీతకు ఏ హాని జరిగినా దానికి జగన్‌దే బాధ్యత అని అన్నారు. సొంత బాబాయిని చంపిన అబ్బాయికి తల్లి, చెల్లి ఓ లెక్కా అని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. జగన్ రెడ్డి పాపం పండిందని యనమల ధ్వజమెత్తారు.
అధికారం కోసం ఆయన చేసిన పాపాలే నేడు శాపాలుగా మారాయని విమర్శించారు. జగన్ రెడ్డి 420 అని వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు ఆయన నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నాయన్నారు. పులివెందులలో సొంత చెల్లెలు సునీతారెడ్డి సభ పెట్టుకోవడానికి కూడా అనుమతి ఇవ్వకపోవడం మహిళలను అవమానించడం కాదా అని ప్రశ్నించారు. సొంత కుటుంబ సభ్యుల నమ్మకమే పొందలేని జగన్ రెడ్డి ప్రజల్ని ఏ విధంగా ఉద్ధరిస్తారని మండిపడ్డారు. మహిళా సాధికారత టీడీపీ తోనే సాధ్యమని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు మహిళలకు ఆస్తి హక్కు, రిజర్వేషన్లు, డ్వాక్రా సంఘాలు ఏర్పాటు కల్పించారని యనమల రామకృష్ణుడు గుర్తు చేశారు.
తల్లిలాంటి రాష్ట్రానికి జగన్ వెన్నుపోటు - ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలి : షర్మిల
యనమనల లేఖ పూర్తి సారాంశం ఇది..'జగన్‌రెడ్డి పాపం పండింది. అధికారం కోసం ఆయన చేసిన పాపాలే నేడు శాపాలుగా మారి జగన్ మెడకు చుట్టుకుంటున్నాయి. రక్తం పంచుకొని పుట్టిన చెల్లెళ్లే జగన్ రెడ్డి నేరాలు, ఘోరాల గురించి చెబుతున్నారు. ఆయన సీఎంగా అనర్హుడు అని వాళ్లే అంటున్నారు. జగన్ రెడ్డి 420 (Jaganreddy 420) అని షర్మిల చేసిన వ్యాఖ్యలు ఆయన నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నాయి. వంచన, నమ్మకద్రోహంతో మహిళా ద్రోహిగా జగన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. ఆయన వ్యవహరిస్తున్న తీరుతో మహిళా లోకం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. జగన్ రెడ్డి లాంటి క్రూర మనస్తత్వం కలిగిన నాయకుడు ఎక్కువ కాలం రాజకీయాల్లో కొనసాగలేరు. ఆయన వ్యవహార శైలిపై తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెబుతోంది. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఆయన విపరీత ధోరణితో తలవంపులు తెచ్చిన మాట నిజం.