Rouse Avenue Court Gave Permission to CBI to Question MLC Kavitha : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు(Delhi Liquor Case)లో అరెస్టు అయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు సీబీఐకు అనుమతి లభించింది. తిహాడ్ జైలులో కవితను ప్రశ్నించేందుకు రౌస్ అవెన్యూ కోర్టును సీబీఐ సంప్రదించింది. ఈ మేరకు కోర్టు ఆమెను ప్రశ్నించేందుకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. ప్రశ్నించటానికి ఒక రోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. కవితను ప్రశ్నించే సమయంలో మహిళా కానిస్టేబుళ్లు ఉండాలని షరతు విధించింది. ప్రశ్నించే సమయంలో ల్యాప్‌టాప్, ఇతర స్టేషనరీకి తీసుకువచ్చేందుకు సీబీఐ(CBI)కు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి మంజూరు చేసింది.
ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన ఈడీ - పలువురు నేతల రియాక్షన్
సోమవారం మధ్యంతర బెయిల్‌పై తుది తీర్పు: ఇప్పటికే కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును సోమవారానికి రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. కుమారుడి పరీక్షల నిమిత్తం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఆమెకు బెయిల్ ఇస్తే ఆధారాలు, సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని ఈడీ వాదించింది. కవిత(MLC Kavitha Arrest)కు వ్యతిరేకంగా లిక్కర్ కేసులో చాలా ఆధారాలు ఉన్నాయని కోర్టుకు తెలిపింది. ఈ కుంభకోణానికి మొత్తం కవితనే ప్రణాళిక రచించారని కోర్టులో ఈడీ వాదనలు వినిపించారు.
Delhi Liquor Case Update :మొత్తం 10 సెల్‌ఫోన్లను ఇచ్చిన ఆమె అన్ని ఫార్మాట్ చేసే ఇచ్చారని, నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా నాలుగు ఫోన్లను ఫార్మాట్ చేశారని ఈడీ అధికారులు సీబీఐ ప్రత్యేక కోర్టుకు తెలిపారు. అప్రూవర్‌గా మారిన నిందితులను కవితకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని బెదిరించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కుమారుడి కోసం బెయిల్ అడుగుతున్న కవిత ఆమె చిన్న కుమారుడు ఏమీ ఒంటరి వాడు కాదని, తనకు సోదరుడు, కుటుంబ సభ్యులు తోడుగా ఉన్నారని తెలిపారు. ఈడీ వాదనలు విన్న కోర్టు తీర్పును సోమవారానికి రిజర్వ్ చేస్తున్నట్లు బుధవారం తెలిపింది. సోమవారమే తుది తీర్పును వెలువరించనుంది. ఏప్రిల్ 20వ తేదీన కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరగనున్నాయి.