BRS KTR Met BRSV Leaders In Hyderabad : విద్యార్థులు, నిరుద్యోగులను అవమానపరిచేలా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. విద్యార్ధులను అధికారం కోసం వాడుకున్న రాహుల్ గాంధీ సన్నాసో లేక రేవంత్ రెడ్డి సన్నాసో చెప్పాలని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. బుధవారం పోలీసుల దాడిలో గాయపడ్డ బీఆర్ఎస్వీ నాయకులతో సమావేశమైన కేటీఆర్ వారికి భరోసానిచ్చారు.
రాజకీయాల కోసం నిరుద్యోగులను వాడుకున్నారు :రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే కూడా భరించలేని నిరంకుశ మనస్తత్వం కలిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు. విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులపైనా పోలీసు దాడులు చేస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను ఎన్నికల కోసం వాడుకొందన్న ఆయన నిరుద్యోగులు, యువకులకు రాజకీయాలను రేవంత్ రెడ్డి అంటగడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఉద్యోగాలు, నోటిఫికేషన్లు అడిగితే వారిని అవమానపరిచేలా, అడ్డగోలుగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలను దాడి చేయటమే ప్రజాపాలననా? :ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 50 వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీ అని ఇపుడు కేవలం 6000 ఉద్యోగాలు అదనంగా ఇచ్చి యువకులను మోసం చేస్తున్నారని ఆక్షేపించారు. ఇదేమి అన్యాయమని అడిగిన వాళ్లందరిపైన కేసులు నమోదు చేస్తున్నారన్న ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారి తలలు పగలగొట్టడం, వీపులు పగలగొట్టడమే ప్రజల పాలనా అని ప్రశ్నించారు. పాత అరాచకాల కాంగ్రెస్ మోసపూరితంగా కొత్త రూపంలో వచ్చిందని ప్రజలు ఆరు నెలల్లోనే అర్థం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. అధికారంలో లేనప్పుడు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు వద్దన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏడు కొత్త వాటికి అనుమతులు ఇచ్చిందని ఆరోపించారు.
బల్లి పడిన టిఫిన్లు, ఎలుకలు తిరిగే చట్నీలతో - కాంగ్రెస్ పెద్ద మార్పే తెచ్చింది: కేటీఆర్ - KTR SLAMS CONGRESS OVER FOOD POISON
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ యువకుడు కథానాయకుడిగా నిలబడిపోతారన్న కేటీఆర్ విద్యార్థులపై దాడులతో చేస్తున్న గాయాలు మానిపోయినా, ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని మాత్రం మర్చిపోరని వ్యాఖ్యానించారు. తెలంగాణ పోలీసులు అధికారులు విద్యార్థుల పైన చేస్తున్న దాడులను విద్యార్థి నాయకులు తమ డైరీలో నమోదు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు, ప్రజలపై దాడులు చేస్తున్న పోలీస్ అధికారులను తాము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలిపెట్టబోమని హెచ్చరించారు. విద్యార్థి విభాగం నుంచి అనేకమంది నాయకులను ప్రజాప్రతినిధులుగా, ఛైర్మన్లుగా, మేయర్లుగా, జిల్లా స్థాయి అధ్యక్షులుగా బీఆర్ఎస్ తయారు చేసుకొందని ఆయన వివరించారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పోరాడే అవకాశం కల్గుతుంది : అధికారంలో ఉన్నప్పటి కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే విద్యార్థి నాయకుల పాత్ర కీలకమవుతుందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడగలిగే అవకాశం కలుగుతుందని చెప్పారు. ప్రభుత్వ అన్యాయాలు, అక్రమాలను ఎండగట్టవచ్చని రాజకీయ నాయకులుగా ఎదిగేందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కువ అవకాశం ఉంటుందని వారికి తెలిపారు. నిజాయతీపరులు, దమ్మున్న నాయకులు వందలు, వేల మంది బీఆర్ఎస్కు ఆస్తిగా ఉన్నారన్న కేటీఆర్ 2009 నుంచి 2014 దాకా తెలంగాణ కోసం విద్యార్థులు చేసిన గొప్ప ఉద్యమ స్ఫూర్తి, పోరాటాలను ఇప్పటి విద్యార్థులకు చెప్పేలా చేయాలని సూచించారు. విద్యారంగంలో జరిగే ప్రతి అన్యాయం దగ్గర విద్యార్థి విభాగం అందోళన ఉండాలని కేటీఆర్ నేతలకు తెలిపారు.
'మీకు ఇదే సరైన సమయమని గుర్తించండి' - కేంద్రమంత్రి బండి సంజయ్‌కు కేటీఆర్ లేఖ - KTR Letter to Bandi Sanjay
ఈ నగరానికి ఏమైంది? - కాంగ్రెస్ హయాంలో 'బ్రాండ్ హైదరాబాద్' ఎందుకు మసకబారుతోంది? - KTR ON CRIME RATE IN HYDERABAD