Pulivendula MLA YS Jagan Oath in Assembly : సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాజయం పొందిన తర్వాత వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలిసారి తాడేపల్లి ప్యాలెస్ నివాసం నుంచి బయటకు వచ్చారు. అన్యమనస్కంగానే శాసనసభలోకి అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం సమయంలోనూ నిస్తేజంగా కదిలారు. సభ్యునిగా తన పేరు ఉచ్ఛారణలో తడబడ్డారు.
శాసనసభలో సభ్యుల ప్రమాణ స్వీకార ఘట్టం మొదలైన ఐదు నిమిషాల తర్వాత కానీ అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకోని జగన్ వరుస క్రమంలో తన పేరు వచ్చేంత వరకు సభ లోపలికి రాలేదు.ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా సభ్యుల వైపు నమస్కారం చేసుకుంటూ ప్రోటెం స్పీకర్ పోడియం వద్దకు వెళ్లారు. మెట్లు ఎక్కుతూ తన వాచీలో సమయం చూసుకుంటూ మర్యాదపూర్వకంగా ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్యచౌదరికి నమస్కారం చేశారు.
మొదటిసారి బయటకొచ్చింది ఇప్పుడే : తనదైన శైలిలో బుచ్చయ్యచౌదరి భుజం తట్టారు. సభ నుంచి శాసనసభలోని తన ఛాంబరుకు చేరుకున్నారు. తాడేపల్లి పేలస్ నుంచి ఎన్నికల ఫలితాల తర్వాత మొదటిసారి జగన్ బయటకొచ్చింది ఇప్పుడే. కేవలం ఓ గంటపాటు మాత్రమే ఉండి తిరిగి తన ప్యాలెస్‌లోకి వెళ్లిపోయారు. అధికారపక్షం మొత్తం చాలా హుందాగా జగన్ విషయంలో వ్యవహరించినా అటువైపు నుంచి ఏ మాత్రం కనీస మర్యాద పాటించలేదని సభ్యులు గుసగుసలాడుకున్నారు.
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, ఇతర సీనియర్ సభ్యుల వద్దకు వచ్చి ప్రత్యక్షంగా అభినందనలు తెలిపి ఉంటే బాగుండేదని, అలా కాకుండా అహంకార ధోరణిలోనే సాగారే తప్ప హుందాగా మెలగలేదని భావిస్తున్నారు. మహాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16వ శాసనసభ సమావేశాలు ఇవాళ ఉదయం 9.46 గంటలకు ప్రారంభమయ్యాయి.
ఆ తరువాత నేరుగా తాడేపల్లి ప్యాలస్‌కు : ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్యచౌదరి సభ్యులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆ తర్వాత ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో ప్రమాణం చేసి సభలో కూర్చోకుండా ఎమ్మెల్యే జగన్ వెళ్లిపోయారు. పేరు పిలిచిన వెంటనే సభలోకి వచ్చారు.
నేరుగా పోడియం వద్దకు వెళ్లి ప్రమాణం చేసి సభలో కూర్చోకుండా వెళ్లిపోయారు. అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ఛాంబర్‌లోకి వెళ్లి కొద్దిసేపు వైసీపీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఆ తరువాత నేరుగా తాడేపల్లి ప్యాలస్‌కు వెళ్లిపోయారు. అసెంబ్లీ లోపలకి వచ్చి ప్రమాణం చేసేందుకు సమయం ఉండటంతో ఐదు నిమిషాల పాటు చివరి బెంచ్‌లో కూర్చున్నారు.
YS Jagan took oath in the Assembly :గత ప్రభుత్వంలోని డిప్యూటీ స్పీకర్ ఛాంబరులోనే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలతో జగన్ కూర్చుండిపోయారు. తన ప్రమాణ స్వీకారం సమయం వచ్చినప్పుడే సభలోకి అడుగు పెట్టారు. ఆయనతో పాటు పక్కనే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కూడా కూర్చొన్నారు. జగన్ పక్కనే పెద్దిరెడ్డి మిగతా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రమాణం చేసేందుకు వస్తున్న సమయంలో అందరికీ దండం పెడుతూ ఎమ్మెల్యేలు వెళ్లారు.