AP Election Result 2024 :మళ్లీ గెలవాలన్న తలంపుతో ఎన్నికల్లో సామదానభేద దండోపాయాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రయోగించారు. అయినా క్షేత్రస్థాయిలో అవేవీ ఫలించినట్లు కనపబడలేదు. దీంతో వైఎస్సార్సీపీ శ్రేణులు డీలాపడకుండాఆపార్టీకి ఎన్నికల సలహాలు అందించే IPAC టీంతో భేటీ అయి గతంలో గెలిచిన 151సీట్లను మించి విజయం సాధిస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు. కానీ ఎన్నికల ఫలితాలను అంచనా వేయడంలో కీలక భూమిక పోషించే సెఫాలజిస్ట్‌లు మాత్రం ఆయన వాదనను తోసిపుచ్చుతున్నారు.
అందరి లెక్కా ఒక్కటే: ప్రముఖ ఎన్నికల పరిశోధన సంస్థ అయిన సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్-CSDCకి చెందిన సీనియర్ సెఫాలజిస్ట్ ప్రొఫెసర్ సంజయ్‌కుమార్ మాత్రం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. తెలుగుదేశం- వైఎస్సార్సీపీ మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లు సాగినప్పటికీ మొగ్గు ఎన్డీఏ వైపే కనిపిస్తోందన్నారు. భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో చెప్పుకోదగ్గ ఓటు బ్యాంక్ లేనప్పటికీ, తెలుగుదేశంతో పొత్తు ఆ పార్టీ కలిసి వచ్చిందన్నారు. బీజేపీ కొన్ని సీట్లు సాధిస్తుందన్నారు. తెలుగుదేశం కూటమి అధికారాన్ని కైవసం చేసుకుంటుందన్న అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు వివిధ రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితిపై CSDCలో‘ఎలక్టోరల్ పాలిటిక్స్’పై పరిశోధనలు చేసే లోక్‌నీతి ప్రాజెక్టు కో డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సంజయ్‌కుమార్, సీనియర్ పాత్రికేయుడు విక్రమ్ చంద్రతో ముచ్చటించారు.
ఏడాది నుంచి మారుతూ వచ్చిన అంశాలు :సంజయ్‌కుమార్, విక్రమ్ చంద్ర చర్చల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల తీరుపై విశ్లేషణ సాగింది. ఆంధ్రప్రదేశ్‌లో జనవరి -ఫిబ్రవరితో పోలిస్తే ఎన్నికల నాటికి పోలింగ్‌ను ప్రభావితం చేసే అంశాలు చాలా వేగంగా మారిపోయాయని సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టుతో జనసేన తెలుగుదేశం కలయిక, ఆ రెండు పార్టీలు బీజేపీతో కూటమి కట్టడం ఎన్డీఏ కూటమికి మేలు చేసిందన్నారు. దక్షిణాదిన ఎన్డీఏకు చంద్రబాబు లాంటి మిత్రుడు తోడుకావటం జాతీయస్థాయిలో బీజేపీకి లాభమన్నారు. ఇది జాతీయ స్థాయిలో మళ్లీ మోదీ ప్రభుత్వ ఏర్పాటుకు దోహదపడుతుందన్న అభిప్రాయాన్ని వెల్లడించారు.