Prashant Kishor :ఏపీలో సార్వత్రిక ఎన్నికలు రోజు రోజుకు దగ్గరపడుతున్న వేళ, గెలుపు సర్వేలు అధికార-విపక్షాల్లో గుబులు రేపుతున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన సర్వేల్లో ప్రతిపక్ష టీడీపీ-జనసేన కూటమికి గెలుపు ఖాయమనే సంకేతాలు ఇచ్చాయి. ఇది ఇలా ఉంటే, టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు ఆది నుంచి గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అందులో భాగంగానే చంద్రబాబు (Chandrababu), పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఉమ్మడిగా 99 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదుల చేశారు. దీంతో రెండు పార్టీ శ్రేణుల్లో గెలుపు గుర్రాలకు అవకాశం కల్పించారనే భావం వ్యక్తమైంది. దీనికి అనుగుణంగా వివిధ సర్వేలు కూడా అత్యధిక మెజార్టీతో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయనే సంకేతాలు ఇచ్చాయి. ఈ తరుణంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాల నమ్మకానికి మరింత బలం చేకురేలా చేస్తున్నాయి. ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.
హైదరాబాద్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజకీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ త్వరలో ఏపీలో జరిగే ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి ( CM Jagan Mohan Reddy) ఓటమి ఖాయమని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ - జనసేన పార్టీల ఉమ్మడి విజయం తధ్యమని చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతుంది. ఈ వ్యాఖ్యలు ప్రతిపక్షాల్లో ఉత్సాహాన్ని రేకిస్తున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ పని చేసిన సంగతి తెలిసిందే.
వైసీపీ ప్రభుత్వంపై ప్రశాంత్ కిశోర్ విమర్శలు - 2024 ఎన్నికల్లో గెలుపు దిశగా టీడీపీ అడుగులు
2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ పని చేశారు. అప్పుడు 151 సీట్లతో విజయఢంకా మోగించారు. జగన్ సీఎం కావడంలో ప్రశాంత్ కిశోర్ కీలక పాత్ర పోషించారు. తరువాత జగన్ ఆయన్ను దూరంగా పెడుతూ వచ్చారు. రాష్ట్ర అభివృద్ధిని, జగన్ పారిపాలనను రాజకీయ వ్యూహకర్త గమనిస్తూ వస్తున్నారు. జగన్ పరిపాలన బాగోలేదంటూ వివిధ సందర్భాల్లో చెప్పారు. సంక్షేమ పథకాల పేరుతో అభివృద్ధిని గాలికొదిలేశారని అన్నారు. ఉచిత పథకాలతో పాటు అభివృద్ధి ముఖ్యమని అన్నారు. చదువుకున్న వాళ్లు ఉచిత పథకాలు కోరుకోవడం లేదని, ఉద్యోగాలు కోరుకుంటున్నారని తెలిపారు.