Ponnam Prabhakar about Handloom Workers : గత పది సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లోనే సిరిసిల్లలో ఈ రెండు పార్టీలు తప్పుడు రాజకీయాలు చేస్తున్నాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో చేనేతలకు ఇచ్చిన ఆర్డర్ల కంటే ఎక్కువ ఇస్తామని, నేతన్నలకు పని కల్పించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లు అప్పులు చేసిందని, అయినా సంక్షేమ పథకాలు ఆపలేదని పేర్కొన్నారు.
నాలుగు నెలల్లో సిరిసిల్ల నేతన్నలకు రూ.120 కోట్ల ఆర్డర్లు ఇచ్చామని మంత్రి పొన్నం చెప్పారు. చేనేతల సంక్షేమం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కొందరు చేనేత కార్మికులను రెచ్చగొడుతున్నారని, శవాల పేరుమీద రాజకీయాలు చేయకండని హెచ్చరించారు. ఇవాళ సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన మీడియా సమాశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డిలతో కలిసి మంత్రి పొన్నం మాట్లాడారు.
Ponnam Comments on BRS : ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ నేతన్నల పేరు మీద శవ రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. చేనేత కార్మికులకు గానీ, ప్రజలకు గానీ ఈ రెండు పార్టీల చేస్తున్న రాజకీయాల వాస్తవాలను తెలపడానికే సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. నేతలన్న ప్రయోజనాల కోసం ఏమైనా నిర్ణయం తీసుకుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప మరొకటి కాదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ వస్త్ర రంగంపై జీఎస్టీ అమలు చేయలేదని అన్నారు.
బీజేపీ ప్రభుత్వం వస్త్ర పరిశ్రమపై 12 శాతం జీఎస్టీ విధించి నేత కార్మికులను అన్నీరకాలుగా ఇబ్బందులకు గురిచేస్తోందని మంత్రి పొన్నం విమర్శించారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం జాతీయ చేనేత బోర్డును, నేషనల్ టెక్స్టైల్ బోర్డు, మహాత్మా గాంధీ గుణకర్ బీమా యోజనని కూడా రద్దు చేసిందని ఆక్షేపించారు. ఈ అయిదేళ్లలో కేంద్రం ఒక రూపాయీ అయినా సిరిసిల్లకు సహాయం చేసిందా అని ప్రశ్నించారు.