Political Parties Speedup Election Campaign :సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే విజయరామారావు ఎన్నికల ప్రచారంనిర్వహించారు. ఉపాధిహామీ కూలీల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని మిరుదొడ్డి, అక్బర్ పేట, భూంపల్లి మండలాల్లో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఆరు గ్యారంటీలతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోందని తెలిపారు.
Congress Party Candidate Election Campaign :ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా కుమురం భీం జిల్లా సిర్పూర్‌లో మంత్రి సీతక్క ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన సత్రాన్ని సందర్శించారు. సత్రంలో కాసేపు వడ్డన చేసిన సీతక్క రోజూ వేలాది మందికి అన్నదానం చేయడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహయం రఘురామిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ పాలేరులోమంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటుచేశారు.
BJP Election Campaign :బీజేపీ అదానీ, అంబానీల కోసం మాత్రమే పనిచేస్తుందని అలాంటి పార్టీకి బుద్ధిచెప్పాలంటే ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మంత్రులు పిలుపునిచ్చారు. ఖమ్మం బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మోదీ నాయకత్వంలోని బీజేపీ కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ షాద్ నగర్, చౌదరిగూడ మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును బీఆర్ఎస్ గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో నిర్వహించిన బీజేపీ కిసాన్ మోర్చా రైతు సమ్మేళనానికి ఎంపీ ధర్మపురి అర్వింద్ హాజరయ్యారు. రైతులకిచ్చిన మాట ప్రకారం పసుపుబోర్డు తీసుకొచ్చానని మళ్లీ గెలిపిస్తే నెలరోజుల్లో షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తానని హామీనిచ్చారు. ఓట్ల కోసం కాంగ్రెస్ నాయకులు దేవుళ్లపై ఒట్లు వేయడం సిగ్గు చేటన్నారు.