Police Raids on TDP Leaders Houses: నెల్లూరు నగరంలోని టీడీపీ నాయకుల ఇళ్లపై పోలీసుల దాడుల ఘటన కలకలం రేపింది. తెల్లవారుజాము నుంచి టీడీపీ నేతలు బిక్కుబిక్కుమంటున్నారు. నెల్లూరు నగర టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న మాజీ మంత్రి పొంగూరు నారాయణ స్నేహితులే లక్ష్యంగా పోలీసులు కొద్ది రోజులుగా దాడులు కొనసాగిస్తున్నారు. నారాయణ ఆర్ధిక మూలాలను దెబ్బతీసెందుకు పది రోజుల కిందట ఇంటిలోనూ, ఆసుపత్రిలోనూ ముమ్మరంగా తనిఖీలు చేశారు.
ఈ రోజు తెల్లవారుజాము నుంచి మాజీ మంత్రి నారాయణ ఉద్యోగులు, టీడీపీ నాయకులు ఇళ్లపై తనిఖీలు చేశారు. కోట గురుబ్రహ్మం, దేవరపల్లి రమణారెడ్డి నివాసాల్లో పోలీసులు జల్లెడ పడుతున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త కోట గురు బ్రహ్మంను పోలీసులు నెల్లూరు బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. సింహాద్రినగర్‌లోని శ్రీధర్ ఇంటిపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. తెల్లవారుజామున పదిమంది పోలీసులు, సీఐ, ఎస్సై రావడంతో అపార్ట్మెంట్లోని వారందరూ భయపడిపోయారు.
పీకే వ్యాఖ్యలతో జగన్ ఉక్కిరిబిక్కిరి! - వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఓటమి భయం
ఇంట్లో నగదు, కాగితాలు, సెల్ ఫోన్లను తీసుకుని పరిశీలన చేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ మహిళా నేత, జిల్లా మాజీ మహిళా విభాగం అధ్యక్షురాలు, మాజీ జెడ్పీటీసీ ముప్పాళ్ల విజేతా రెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. ఇంట్లో ఏమిలేకపోవడంతో వెనుదిరిగిన పోలీసులు 25 వేల రూపాయలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు.
విషయం తెలుసుకుని విజేత రెడ్డి నివాసానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెళ్లారు. పోలీసుల తీరుపై కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలనే లక్ష్యంగా దాడులు చేయటం అన్యాయం అంటూ మండిపడ్డారు. కొద్ది రోజులుగా నెల్లూరులో టీడీపీ మాజీ మంత్రి నారాయణ సన్నిహితులే లక్ష్యంగా పోలీసులు దాడులు చేస్తున్నారని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు.
అధికార వైసీపీ ఆదేశాలతోనే టీడీపీ సీనియర్ మహిళా నేత విజేతారెడ్డి ఇంట్లో తనిఖీలు చేశారని మండిపడ్డారు. మరి కొద్దిరోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న తరుణంలో టీడీపీ నేతల ఆర్థిక మూలాలు దెబ్బతీసేందుకు వైసీపీ కుట్ర చేస్తోందన్నారు. ఆమె నివాసంలో ఏమీ దొరక్కపోవడంతో పోలీసులు ఉత్తచేతులతో వెనుదిరిగారన్నారు. టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేసిన పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విజేతారెడ్డి ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించారు.
నేటితో ముగియనున్న టీడీపీ రా కదలిరా సభలు - భారీగా రానున్న టీడీపీ శ్రేణులు