Police Case on YSRCP Social Media : అధికారానికి దూరమైనా తీరు మారలేదు. ఆపార్టీ శ్రేణులు, అభిమానులు సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారు. టీడీపీ, జనసేన నాయకుల ఫిర్యాదుతో విజయవాడ కమిషనరేట్ పరిధిలో శనివారం ఒక్కరోజే పోలీసులు 42 కేసులు నమోదు చేశారు.
సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీ రెచ్చిపోతోంది. ఎక్స్, ఫేస్‌బుక్ వేదికగా ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అసభ్యకరంగా, వైషమ్యాలను రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వంపై విమర్శలు చేసినా, అలాంటి పోస్టులను ఫార్వర్డ్ చేసినా ప్రతిపక్షాలు, సామాజిక కార్యకర్తలను సీఐడీ అధికారులు అర్ధరాత్రి ఇళ్లల్లోకి వచ్చి మరీ అరెస్ట్లు చేశారు. వైఎస్సార్సీపీ నేతలు విపక్షాలపై అభ్యంతరకర పోస్టులు పెట్టినా అప్పట్లో పోలీసులు కిమ్మన లేదు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ నాయకులు అధికారం కోల్పోయినా ఆ పార్టీ సోషల్ మీడియా తీరు మారలేదు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ , హోం మంత్రి అనితలతో పాటు వారి కుటుంబ సభ్యులను కించపరుస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పోస్టులు పెడుతోంది.
కూటమి ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వారిపై తెలుగుదేశం, జనసేన నాయకుల ఫిర్యాదుల మేరకు విజయవాడ కమిషనరేట్ పరిధిలో శనివారం ఒక్కరోజే పోలీసులు 42 కేసులు నమోదు చేశారు. పశ్చిమ డివిజన్‌లో 5, నార్త్ డివిజన్‌లో 3, సౌత్ డివిజన్‌లో 3, సెంట్రల్ డివిజన్‌లో 6, సైబర్ పీఎస్‌లో 9, మైలవరం డివిజన్‌లో 2, నందిగామ డివిజన్‌లో 14 కలిపి మొత్తం 42 కేసులు పెట్టారు. వీటితో ఇప్పటి వరకు ఈ తరహా కేసులు మొత్తం 47 నమోదయ్యాయి.