'కాళేశ్వరం విషయంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కు - ప్రభుత్వం మారినా పాలనలో మార్పు లేదు' PM Modi Speech at Adilabad Vijaya Sankalp Sabha : ఆదిలాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ, ఇది ఎన్నికల సభ కాదని, అభివృద్ధి ఉత్సవమని పేర్కొన్నారు. 15 రోజుల్లో 5 ఎయిమ్స్ సంస్థలను ప్రారంభించామని, సమ్మక్క-సారక్క సెంట్రల్ ట్రైబల్ వర్సిటీని స్థాపించామని తెలిపారు.
PM Modi Adilabad Tour News : హైదరాబాద్‌లో రాంజీ గోండ్ పేరుతో ఆదివాసీ మ్యూజియం ప్రారంభించామన్న ప్రధాని మోదీ, తెలంగాణ రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే దేశంలో త్వరలో 7 మెగా టెక్స్‌టైల్స్ పార్కులు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. ఆ పార్కుల్లో ఒకదానిని తెలంగాణలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మోదీ గ్యారంటీ అంటే, కచ్చితంగా అమలయ్యే గ్యారంటీ అని స్పష్టం చేశారు.
'బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం కుంగింది. కాళేశ్వరం విషయంలో బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ కుమ్మక్కవుతుంది. గతంలో మీరు తిన్నారు, ఇప్పుడు మేం తింటాం అన్నట్లుంది కాంగ్రెస్ పరిస్థితి. బీఆర్‌ఎస్ పోయి, కాంగ్రెస్ వచ్చినా పాలనలో మార్పు లేదు. ప్రతిక్షణం మీకోసం పని చేస్తా. 140 కోట్ల ప్రజలే నా కుటుంబం. ప్రజల కలల సాకారం కోసం నేను పని చేస్తా. రామమందిర ద్వారాలు తెలంగాణలో తయారయ్యాయి. రాముడి ఆశీర్వాదం తెలంగాణ ప్రజలపై ఎప్పుడూ ఉంటుంది. వికసిత్ భారత్ కోసం బీజేపీ కృషి చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో పార్టీ 400 సీట్లలో గెలవాలి.' అని మోదీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
అభివృద్ధి కావాలంటే - బీజేపీ గెలవాలి : అంతకుముందు మాట్లాడిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి రాష్ట్రంలోని అన్ని ఎంపీ సీట్లలో పార్టీ గెలవాలని పేర్కొన్నారు. హైదరాబాద్ స్థానంలోనూ బీజేపీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేదన్న ఆయన, రేవంత్ సర్కార్ ప్రజలను మభ్య పెడుతుందని విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలవాలన్నారు.