PM Modi Speech at Adilabad Meeting Today 2024 : దేశంలోని అనేక రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడి పదేళ్లు అయ్యిందని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని స్పష్టం చేశారు. నేడు ఎన్టీపీసీ రెండో యూనిట్ ప్రారంభించామన్న ఆయన, ఈ రెండో యూనిట్ 800 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని వివరించారు. ఈ క్రమంలోనే పేదలు, దళితులు, ఆదివాసీల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. గత పదేళ్లలో పేదరికం నుంచి 25 కోట్ల మంది బయటపడ్డారన్న ఆయన, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాభివృద్ధి కోసం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.
PM Modi Adilabad Tour News : ఆదిలాబాద్ సభలో రూ.7 వేల కోట్ల విలువైన పనులను ప్రధాని మోదీ ప్రారంభించారు. పలు అభివృద్ధి పనులను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని, రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. 800 మెగావాట్ల రెండో దశ విద్యుత్ కేంద్రాన్ని జాతికి అంకితమిచ్చారు. దాంతో పాటు పలు రైల్వే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రధానమంత్రి, అంబారి - పింపల్‌కుట్టి విద్యుదీకరణ ప్రాజెక్టు, డబ్లింగ్, విద్యుదీకరించిన సనత్‌నగర్ - మౌలాలి మార్గాలను ప్రారంభించారు.