12.46 PM
మోదీ గ్యారంటీ అంటే కచ్చితంగా అమలయ్యే గ్యారంటీ : మోదీ
వికసిత్ భారత్ కోసం బీజేపీ కృషి చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లలో గెలవాలని ఆకాంక్షించారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతి చేశామని, సమ్మక్క-సారక్క సెంట్రల్ ట్రైబర్ వర్సిటీని స్థాపించామని, హైదరాబాద్‌లో రాంజీ గోండ్ పేరుతో ఆదివాసీ మ్యూజియం ప్రారంభించామని చెప్పారు. తెలంగాణ రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేశామన్న మోదీ, దేశంలో 7 మెగాటైక్స్‌టైల్స్ పార్కులు ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. 7 మెగాటెక్స్‌టైల్స్ పార్కుల్లో ఒకదానిని తెలంగాణలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మోదీ గ్యారంటీ అంటే కచ్చితంగా అమలయ్యే గ్యారంటీ అని స్పష్టం చేశారు.
12.33 PM
ఇది ఎన్నికల సభ కాదు - ఇది అభివృద్ధి ఉత్సవం : మోదీ
ఆదిలాబాద్‌లో బీజేపీ విజయసంకల్ప సభలో పాల్గొన్న ప్రధాని మోదీ ప్రసంగించారు. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ ఇది ఎన్నికల సభ కాదని అభివృద్ధి ఉత్సవం అని తెలిపారు. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాలేదని 15 రోజుల్లో ఎన్నో అభివృద్ధి పనులను ప్రారంభించామని మోదీ వెల్లడించారు.
12.25 PM
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలవాలి : కిషన్ రెడ్డి
ఆదిలాబాద్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ అనంతరం బీజేపీ విజయసంకల్ప సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ఎంపీ సీట్లలో బీజేపీ గెలవాలని అన్నారు. హైదరాబాద్ స్థానంలోనూ బీజేపీ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్య పెడుతుందని విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలవాలని పేర్కొన్నారు.
12.00 PM
రూ.7వేల కోట్ల విలువైన పనులను ప్రారంభించిన ప్రధాని మోదీ
రూ.7వేల కోట్ల విలువైన పనులను ప్రధాని మోదీ ప్రారంభించారు. పలు అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శ్రీకారం చుట్టారు. రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. 800 మెగావాట్ల రెండో దశ విద్యుత్ కేంద్రాన్ని జాతికి అంకితం చేసిన మోదీ, పలు రైల్వే అభివృద్ధి పనులు ప్రారంభించారు. అంబారి- పింపల్‌కుట్టి విద్యుదీకరణ ప్రాజెక్టు, డబ్లింగ్, విద్యుదీకరించిన సనత్‌నగర్- మౌలాలి మార్గానికి శ్రీకారం చుట్టారు.