Malkajgiri MP Etela React on Peerzadiguda House Demolition : అక్రమ కట్టడాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పీర్జాదిగూడ మున్సిపాలిటీలోని చిరుద్యోగుల ఇళ్లు కూల్చివేస్తోందని బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అక్రమ కూల్చివేతలను ఖండిస్తున్నట్లు తెలిపారు.
సాయిప్రియ ఎన్‌క్లేవ్‌లో చిన్న చిన్న ఉద్యోగులు, నిరుపేదలు 30 ఏళ్ల కిందట భూములు కొనుగోలు చేశారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అక్కడున్న నిర్మాణాలను అకారణంగా కూల్చుతున్నారని దుయ్యబట్టారు. భూముల ధరలు పెరిగాయని ఇప్పుడు కూల్చివేయటం దారుణమన్నారు.
Etela Rajender Fires on Congress Party :అవి అక్రమ భూములు అయితే, ఆనాడు ఇళ్ల నిర్మాణానికి, గృహ రుణాలకు ఎలా అనుమతి ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సమస్య ఉత్పన్నమైతే పరిష్కరించాల్సిన ప్రభుత్వం, హింసకు గురిచేయడం సబబు కాదన్నారు. కాంగ్రెస్ వైఖరి వల్ల 300 మంది చిరుద్యోగులు రోడ్డున పడ్డారన్న ఆయన, 30, 40 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన భూముల విషయంలో ఇప్పుడు కలుగజేసుకోవటం సరికాదని ఆక్షేపించారు.
"రెక్కాడితే కానీ డొక్కాడని ఆ పేదవాళ్లు, 30 యేళ్ల క్రితం పీర్జాదీగూడలో భూములను కొనుక్కున్నారు. వాళ్లకు అన్ని పర్మిషన్లు ఉన్నా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అకారణంగా కట్టుకున్న ఇళ్లను కూల్చివేసింది. అడిగే నాథుడు లేడు. కూలగొట్టిన ఆ ఇళ్లకు పరిహారం చెల్లించాలి. అదేవిధంగా అప్పుడు అనుమతులు ఇచ్చిన కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలి."-ఈటల రాజేందర్, బీజేపీ ఎంపీ
పేదల ఇళ్లను కూల్చివేసేందుకే ప్రజలు అధికారం ఇచ్చారా? : ఈ ప్రాంతంలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కూల్చిన ఇళ్లకు పరిహారం అందజేసి బాధితులకు క్షమాపణలు చెప్పాలన్నారు. నాటి కేసీఆర్ ప్రభుత్వమైనా, నేటి రేవంత్ సర్కారైనా పేదలను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. గతంలో కేసీఆర్ ఇలాంటి చర్యలకు పాల్పడితేనే ఓడిపోయారని గుర్తు చేశారు.