KAKINADA PORT RATION MAFIA : కాకినాడ పోర్టుకు సమీపంలో లంగరు వేసిన స్టెల్లా ఎల్ నౌకలో రాష్ట్ర అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది. ప్రభుత్వం ద్వారా పేదలకు పంపిణీ చేసిన ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యం అక్రమంగా సేకరించి తరలిస్తున్నారనే అనుమానాలున్న నేపథ్యంలో నమూనాలు సేకరించారు. నౌకలోని ఐదు హేచెస్లో నిల్వ చేసిన బియ్యం నమూనాలు సేకరించిన విచారణ బృందం వాటిని ప్రయోగశాలకు తరలించింది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత రానున్నట్లు తెలిపారు.
కాకినాడ తీరం నుంచి దక్షిణాఫ్రికా దేశాలకు బియ్యం ఎగుమతి చేస్తున్న "స్టెల్లా ఎల్- పనామా" షిప్లో రాష్ట్ర ప్రభుత్వ కీలక విభాగాలకు చెందిన అధికారుల బృందం తనిఖీలు చేసింది. బుధవారం ఉదయం కాకినాడలోని ఎస్‌పీఎఫ్, కస్టమ్స్ అధికారులతో పాటు రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ, ఆ సంస్థ, పోలీసు, పోర్టుకు చెందిన 10 మంది బృందం సముద్రంలోకి వెళ్లింది. స్టెల్లా నౌక తీరానికి 9 నాటికల్ మైళ్ల దూరంలో నిలిచి ఉండడంతో పడవలో బయల్దేరి ఉదయం 10.25 గంటలకు చేరుకున్నారు. రాత్రి 11 గంటల వరకు తనిఖీలు నిర్వహించి అనుమానాస్పదంగా కనిపించిన బియ్యం నిల్వలను పరిశీలించి మొత్తం 36 నమూనాలు సేకరించి భద్రపరిచారు. ఎగుమతి చేస్తున్న బియ్యం ఏ మిల్లు నుంచి తరలిస్తున్నారు? యజమాని, ఎగుమతిదారులెవరు అనే వివరాలతో పాటు బియ్యం ఎక్కడికి, ఎవరికి పంపుతున్నారని విషయాలు సేకరించారు. సేకరించిన బియ్యం నమూనాలను కాకినాడలోనే ఉన్న పౌరసరఫరాల సంస్థ జిల్లా ప్రయోగశాలకు పంపగా ఒకట్రెండు రోజుల్లో ఫలితాలు రానున్నాయి. అవి పేదల బియ్యం అని తేలితే తదుపరి చర్యలపై కఠిన నిర్ణయం తీసుకోనున్నారు. పిఠాపురం తహసీల్దార్ పీవీవీ గోపాలకృష్ణ నేతృత్వంలో విచారణ జరుగుతోంది. స్టెల్లా నౌకలో పేదల బియ్యం ఉన్నట్లు కాకినాడ కలెక్టర్ షాన్‌మోహన్ ప్రకటించారు. దాదాపు 640 టన్నులు పీడీఎస్ బియ్యం నిల్వలున్నాయని ఆయన వెల్లడించారు. తిరిగి రెండు రోజుల తర్వాత డిప్యూటీ సీఎ పవన్ కల్యాణ్ పోర్టును తనిఖీ చేసి నౌకను సీజ్ చేయాలని ఆదేశించారు.