nominations scrutiny process over: ఎన్నిక నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. ఈ నెల 18 తేదీ ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ 25 తేదీ వరకూ కొనసాగింది. వివిధ పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటుగా స్వతంత్ర అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ఆలస్యమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
సార్వత్రిక ఎన్నికల్లో నిన్న పూర్తి కావాల్సిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ తీవ్ర ఆలస్యమైంది. పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావటంతో వాటిని స్క్రూటిని చేసేందుకు రిటర్నింగ్ అధికారులు రెండు రోజుల సమయం తీసుకున్నారు. 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు గానూ మొత్తం 686 నామినేషన్లు దాఖలైనట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ప్రకటించింది. ఇందులో 503 నామినేషన్లకు రిటర్నింగ్ అధికారులు ఆమోదం తెలిపారు. మొత్తం 183 నామినేషన్లను వివిధ కారణాలతో ఎన్నికల అధికారులు తిరస్కరించారు.
అత్యధికంగా గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గానికి 47 నామినేషన్లు దాఖలు అయ్యాయి. శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గానికి అత్యల్పంగా 16 నామినేషన్లు దాఖలైనట్టు ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం తెలిపింది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ మొత్తం 3644 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 2705 నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు పరిశీలన అనంతరం ఆమోదించారు. 939 నామినేషన్లను తిరస్కరించారు. అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి 52 నామినేషన్లు దాఖలైతే అత్యల్పంగా చోడవరం నియోజవర్గంలో 8 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఈ నెల 29 తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం గడువు విధించింది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం తుది అభ్యర్ధుల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనుంది.