Special recipes for Sankranti : తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సందడి మొదలైపోయింది. సిటీల్లో ఉండే వారు చాలా మంది సొంతూళ్లకు చేరుకోవడంతో వీధులన్నీ కోలాహలంగా మారిపోయాయి. అయితే, ఈ సంక్రాంతికి మన దగ్గర కొత్త బియ్యంతో అరిసెలు చేస్తుంటారు. పిల్లలు, పెద్దలందరూ బెల్లం అరిసెలను ఎంతో ఇష్టపడతారు. మన ఆనందాన్ని ఈ అరిసెలతో పంచుకుంటాం కదా! అయితే, మన దగ్గర సంక్రాంతి జరుపుకున్నట్లే ఇతర రాష్ట్రాల్లో కూడా వివిధ పేర్లతో పండగ జరుపుకుంటారు. ఆయా రాష్ట్రాల్లో కొత్త బియ్యంతో తమదైన శైలిలో పసందైన వంటలు చేస్తారు. అందులో కొన్ని రెసిపీలు మీ కోసం తీసుకొచ్చాం. అవేంటో ఓ సారి చూసేయండి.
మకర్ చౌలా (Makar Chaula Recipe) :
కావాల్సిన పదార్థాలు :
- కొత్తబియ్యం - కప్పు
- బెల్లంపొడి - అర కప్పు
- అరటిపండు - 1
- కొబ్బరికోరు - పావు కప్పు
- నువ్వులు - 2 టేబుల్ స్పూన్లు
- పాలు - పావు కప్పు
- నెయ్యి - 2 చెంచాలు
- కిస్‌మిస్- కొన్ని
- జీడిపప్పులు - కొన్ని
- దానిమ్మ గింజలు - చెంచా
- యాపిల్ ముక్కలు - కొద్దిగా
తయారీ విధానం :
- ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.
- ఆ తర్వాత స్టౌపై ఒక గిన్నె పెట్టుకోండి. రెండు కప్పుల నీళ్లు పోసి బాగా మరిగించండి. నీరు మరుగుతున్నప్పుడు రైస్ వేసి ఉడికించుకోండి. అన్నం మెత్తగా పేస్ట్‌లాగా వండుకుని స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టి నువ్వులు వేయండి. స్టౌ మీడియం ఫ్లేమ్‌లో ఉంచి నువ్వులను బంగారు రంగు వచ్చే వరకూ వేయించాలి. ఆపై వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి.
- పాన్‌లోనే కాస్త నెయ్యి వేసి కిస్‌మిస్, జీడిపప్పులను దోరగా వేయించండి.
- ఇప్పుడు పాన్‌లో పాలు పోసి బాగా మరిగించండి.
- అనంతరం కాస్త గోరువెచ్చగా ఉన్న అన్నంలో వేడివేడి పాలు, బెల్లంపొడి, వేయించిన నువ్వులు, కొబ్బరికోరు, అరటిపండు, యాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి.
- అంతే ఇలా సింపుల్‌గా చేసుకుంటే ఎంతో రుచికరమైన ఒడిశా స్టైల్ 'మకర్ చౌలా' మీ ముందుంటుంది.
తిల్ పీఠా (Til Pitha Recipe) :
కావాల్సిన పదార్థాలు :
- బియ్యం - కప్పుంబావు
- నల్ల నువ్వులు - కప్పు
- బెల్లం - 2 కప్పులు
- ఎండు కొబ్బరి కోరు - 2 టేబుల్‌స్పూన్లు
- సోంపు - టేబుల్‌స్పూన్
తయారీ విధానం :
- ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి నాలుగు గంటలు నానబెట్టుకోవాలి. ఆపై నీళ్లు పూర్తిగా వంపేయాలి.
- ఇప్పుడు ఒక పొడి వస్త్రం మీద ఆరబోయాలి.
- బియ్యం పొడిపొడిగా అయిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. (బియ్యం పిండి ఎంత మెత్తగా ఉంటే పీఠా అంత బాగా రుచిగా వస్తుంది.)
- పిండిని ఒక గిన్నెలోకి తీసి పాలిథిన్ పేపరుతో చుట్టి ఓ గంటపాటు పక్కనుంచాలి.
- ఈలోపు స్టౌపై పాన్ పెట్టి నువ్వులు వేసి దోరగా వేయించుకోవాలి.
- నువ్వులు చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. ఇందులో సోంపూ, బెల్లం, కొబ్బరి కోరు జతచేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై ఒక పెనం పెట్టండి. ఆపై వేడివేడిగా ఉన్న పెనం మీద చారుగరిటెడు బియ్యప్పిండి వేయండి.
- అనంతరం అదే గరిటెతో వెడల్పుగా పరిచినట్లు చేయాలి. దాని మీద తగినంత గ్రైండ్ చేసుకున్న నువ్వుల స్టఫింగ్ వేయాలి.
- తిల్ పీఠా దోశలా గట్టిపడిన పిండిని మెల్లగా రోల్ చేసి, ప్లేట్లోకి తీసుకోవాలి.
- మిగిలిన పిండితోనూ ఇలాగే పీఠాలు చేసుకోవాలి. అంతే ఇలా సులభంగా చేసుకుంటే అసోం స్పెషల్ తిల్ పీఠా రెడీ. ఇవి పది రోజుల పాటు నిల్వ ఉంటాయి.
గుడ్ కా హల్వా (Gud ka Halwa Recipe) :
కావాల్సిన పదార్థాలు :
- ఉప్మారవ్వ - కప్పు
- బెల్లంపొడి - అర కప్పు
- పాలు - పావు కప్పు
- నెయ్యి - 3 చెంచాలు
- సోంపు - చెంచా
- బాదం, కిస్‌మిస్ - 2 చెంచాలు
- జీడిపప్పులు - 2 చెంచాలు
- కుంకుమ పువ్వు - చిటికెడు
తయారీ విధానం :
- ముందుగా స్టౌపై పాన్ పెట్టి నెయ్యి వేయండి. నెయ్యి వేడయ్యాక సోంపు, బాదం, కిస్‌మిస్, జీడి పప్పులు వేసి దోరగా వేయించండి. ఆపై రవ్వ వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి.
- అనంతరం స్టౌ ఆఫ్ చేసి మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై అడుగు భాగం మందంగా ఉన్న పాత్ర పెట్టండి. ఇందులో బెల్లం పొడి, తగినన్ని నీళ్లు పోసి మరిగించండి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత దానిని వడకట్టుకోవాలి.
- అనంతరం బెల్లం సిరప్‌ని ఒక గిన్నెలోకి తీసుకుని స్టౌపై పెట్టండి. సిరప్‌లో రవ్వ వేసి కలపండి.
- ఒక మూడు నిమిషాల తర్వాత పాలు, కుంకుమపువ్వు వేసి సన్నని సెగ మీద ఉడికించాలి.
- హల్వా దగ్గరగా అయ్యాక స్టౌ ఆఫ్ చేయాలి. అంతే ఇలా చేసుకుంటే నోరూరించే పంజాబీ స్పెషల్ 'గుడ్ కా హల్వా' రెడీ.
- ఈ రెసిపీలు నచ్చితే మీరు కూడా పండక్కి ట్రై చేయండి.
సంక్రాంతి స్పెషల్: నోట్లో వేసుకోగానే కరిగిపోయే "అటుకుల కేసరి"- ఇలా చేస్తే టేస్ట్ అద్భుతం!
"రాయలసీమ స్టైల్ నాటుకోడి వేపుడు" - సంక్రాంతికి ఇలా చేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవల్!